Software Engineer Turns Into thief in Hyderabad : అతడు ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నగరంలో సొంతిల్లు నెలకు రూ.1.10 లక్షల జీతం. విలాసాల కోసం పక్కదారి పట్టాడు. డబ్బుల కోసం సహోద్యోగి ఇంట్లోనే దోపిడీ చేశాడు. ఒంటరిగా ఉన్న గృహిణిపై కత్తితో దాడి చేసి చేతికి ఉన్న బంగారు గాజులతో ఉడాయించాడు. చివరికీ పోలీసులకు చిక్కి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాజీపేటవాసి కళాహస్తి హరీశ్‌కృష్ణ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉన్నాడు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నాడు. బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడి వారి వద్దా వీరివద్దా అప్పులు చేశాడు. వచ్చేటువంటి జీతం జల్సాలకు, అప్పులకు సరిపోక చోరీలు పాల్పడుతున్నాడు.
వాట్సాప్ గ్రూప్‌లో సమాచారంతో :వాట్సాప్ గ్రూప్‌లో సమాచారంతో తన కంపెనీలోని ఉద్యోగి కేవీ. మణికంఠతో హరీశ్‌కృష్ణకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మిగిలిన ఉద్యోగులతో కలిసి ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడేవారు. ఈ ఆటగాళ్లందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈక్రమంలోనే మాదాపూర్ చంద్రానాయక్ తండాలో ఉన్న మణికంఠ అనే వ్యక్తి ఇంటికి హరీశ్‌కృష్ణ పలుసార్లు వెళ్లాడు. డబ్బు కోసం మణికంఠ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్ ద్వారా ఈనెల 25వ తేదీన మణికంఠ ఇంట్లో ఉండటం లేదని తెలుసుకుని హరీశ్‌కృష్ణ ఉదయం 11.15 గంటలకు ముఖానికి ముసుగు, తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి వెళ్లి 18 నెలల పాపతో ఉన్న మణికంఠ భార్యకు కత్తిని చూపి ఒంటిపై ఉన్న నగలివ్వకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు.