Smart Homes In Hyderabad: మీ ఇంట్లో వెలుగు కావాలంటే మీరే లైట్స్ ఆన్ చేసుకుంటారు. ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉండటానికి, గేట్ ఓపెన్ చేసుకోవడానికి వాచ్మెన్ తప్పకుండా ఉండాలి. కానీ స్మార్ట్ ఇళ్లలో మీరు చేసేది ఏమీ ఉండదు. అన్నీ స్మార్ట్‌గా అవే జరిగిపోతుంటాయి. అది ఎలా అనుకుంటున్నారా? చూద్దాం రండి.
ఆటోమేటిక్‌గా : కారు ఇంటి ముందుకు రాగానే ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుంటుంది. కారు పార్కింగ్ చేయాలనుకుంటే డోర్ వద్దకు వెళ్లి వేలిముద్ర వేస్తే చాలు అది ఓపెన్ అవుతుంది. ఇంటి లోపలికి వెళ్తుంటే మీ కదలికలతో లైట్లు, ఫ్యాన్‌లు, కర్టెన్లు వాటంతటవే మార్పులు చేసుకుంటాయి. స్నానం చేసేందుకు వేడి నీళ్లు కావాలంటే ఓ మనిషికి చెప్పినట్లుగా ‘హలో గీజర్ - రెడీ హీట్ వాటర్’ అంటే చాలు క్షణాల్లో వేడి నీళ్లు రెడీ అవుతాయి. ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్లేటప్పుడు వాటంతట అవే పని చేయడం ఆగిపోతాయి. దొంగలు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే అప్రమత్తం చేస్తాయి. ఇవన్నీ ఎక్కడో సినిమాలో చూశాం అనుకుంటున్నారా. కాదండోయ్.. ఇకపై ఇవి మన ఇళ్లలోనూ సాధ్యమే.
అవును. ఇప్పుడు ఇవన్నీ స్మార్ట్ ఇళ్లలో సాధ్యమయ్యేవే. హైదరాబాద్‌లో కొంత మంది రాజకీయ నేతలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వ్యాపార వేత్తలు, ఇలా స్మార్ట్ ఇళ్లను కట్టించుకునేందుకు ఇష్టపడుతున్నారు. టెక్నాలజీ వినియోగంతో మెరుగైన వసతులు సమకూరడంతో పాటుగా భద్రతాపరంగానూ తోడ్పాటు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చెప్పింది వింటాయ్ :స్మార్ట్ హోమ్‌లలో చాలా పరికరాలు సాంకేతికత ఆధారంగా పని చేసేలా మార్పులు చేయించుకొంటున్నారు. ట్యూబ్‌లైట్ నుంచి ఫ్యాన్, గీజర్ వరకు అన్నింటినీ తమ వాయిస్, స్మార్‌ఫోన్‌తో నియంత్రిస్తున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వెళ్లేంత వరకు ఉన్నచోట నుంచి కదలకుండా చాలా పనులు చేసుకుంటున్నారు. ఉదాహరణకు కిటికీలకు కర్టెన్లు వేసి ఉన్నాయి. వాటిని పక్కకు జరపాలంటే మొబైల్ యాప్, వాయిస్ ద్వారా నియంత్రించే అవకాశం ఉంటుంది.