New SkyWalk in Parade Ground Metro Station : పరేడ్ గ్రౌండ్ మెట్రో రైలు స్టేషన్ వద్ద కొత్తగా మరో స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఫ్లైఓవర్ ఉన్న కారణంగా స్టేషన్ నుంచి కిందికి వచ్చి రోడ్డు దాటాల్సి వస్తోంది. అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో, రెండోవైపు ఎల్ అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో అనుసంధానం కోసం ఈ స్కైవాక్ నిర్మించనున్నారు.
పై వంతెనలున్న చోట మెట్రో స్టేషన్లను రహదారికి ఒక వైపు నిర్మించారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్‌ను ఇలాగే సికింద్రాబాద్ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) కళాశాలవైపు నిర్మించారు. రహదారి దాటి రెండో వైపు రావాలంటే చాలామంది ప్రయాణికులకు కష్టతరంగా ఉంది. ప్రయాణికుల ఇబ్బందిని తొలగించేందుకు ఇక్కడ కొత్తగా స్కైవాక్ నిర్మించారు. ఇదే మాదిరి పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కూడా కొత్తగా నిర్మించబోతున్నారు.
ప్రయాణికుల సౌకర్యం దృష్యా : ఈ స్కైవాక్‌ను ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ సిద్దమవుతోంది. జంట నగరాల్లో కాలినడకన వెళ్లే వారి కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. నగరంలోని పెద్ద పెద్ద చౌరస్తాల్లో పాదచారుల సౌకర్యం కోసం స్కైవాక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జంక్షన్లలో వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్‌లను నిర్మిస్తున్నారు.