SIT Investigation On Violence In AP Elections: ఎన్నికల పోలింగ్ హింసలో ఎవరి పాత్రేంటో తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలిస్తోంది. అల్లర్లను ఎందుకు నిలువరించలేకపోయారని స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నేడు సిట్ బృందాల విచారణ కొనసాగనుంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి.
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation
అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సిట్ సభ్యులు:ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల సిట్ బృందం నరసరావుపేటలో అల్లర్లు జరిగిన మల్లమ్మ సెంటర్, గుంటూరు రోడ్డులోని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద సంఘటన స్థలాలను పరిశీలించింది. అనంతరం పల్నాడు రోడ్డులోని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌లు అధ్యయనం చేసింది. ఈ సంఘటనల్లో ఏయే వర్గాలు పాల్గొన్నాయి? ముందుగా రెచ్చగొట్టింది ఎవరు? తదితర వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. వీడియో ఫుటేజీలు పరిశీలించారు.
ఇప్పటివరకూ ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? ఏయే సెక్షన్లు పెట్టారు? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అరెస్టులున్నాయా? వంటి వివరాలను సీఐ భాస్కర్‌ను అడిగారు. అల్లర్లను ఎందుకు నియంత్రించలేదని సిట్ బృందం పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేడూ సిట్ అధికారులు నరసరావుపేటలో విచారణ కొనసాగించనున్నారు.