ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుర్తుతెలియని వ్యక్తులు’ అంటూ తప్పించేశారు- ఎన్నికల హింసాకాండలో పోలీసుల పాత్రపైనా దర్యాప్తుకు సిట్​ సిఫార్సు - Violence After Polling in AP - VIOLENCE AFTER POLLING IN AP

SIT Final Report to DGP Over Violence After Polling in AP : ఎన్నికల వేళ చేలరేగిన హింసాత్మక ఘటనల్లో మారణాయుధాలతో దాడికి తెగబడినా నామమాత్రం సెక్షన్లే పెట్టి సరిపెట్టారని, ఈవీఎంను ధ్వంసం చేసింది ఎవరో తెలిసినా గుర్తుతెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) తేల్చిచెప్పింది.

sit_final_report_to_dgp_over_violence_after_polling_ap
sit_final_report_to_dgp_over_violence_after_polling_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 12:28 PM IST

SIT Final Report to DGP Over Violence After Polling in AP : హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సిట్‌ తన తుది నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 264 పేజీలతో కూడిన రెండు వాల్యూమ్​లతో కూడిన నివేదికను సిట్ సమర్పించింది. హింసాత్మక ఘటనల్లో స్థానిక పోలీసుల ప్రేక్షక పాత్ర వహించిన అంశాలతో పాటు తదుపరి చేయాల్సిన దర్యాప్తుపైనా సిఫార్సులు చేసింది. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను తేటతెల్లం చేసేలా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ తన నివేదికలో సూచించింది.

పోలింగ్‌ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక, ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రం సెక్షన్లే తప్ప హత్యాయత్నం సెక్షన్‌లు పెట్టలేదని మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైఎస్సార్సీపీ నాయకులు పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదులిచ్చి తప్పించేందుకు యత్నించారని పేర్కొంది. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బీఎల్వోలతో ఇప్పించారని అత్యధిక కేసుల్లో నిందితులను ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’గా పేర్కొన్నారని ఆయా కేసుల్లో కొందరిని గుర్తించినా అరెస్టు చేయలేదని సిట్‌ తెలిపింది.

బరితెగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి- వీధిరౌడీని తలదన్నేలా ఈవీఎం ధ్వంసం - Pinnelli Destroy EVM

హింసాకాండపై సిట్‌ తుది నివేదిక- పోలీసుల ప్రేక్షక పాత్రపైనా దర్యాప్తుకు సిఫార్సు (ETV Bharat)

కేసుల నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ చూపించలేదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం గత నెల 20నే ప్రాథమిక నివేదిక సమర్పించగా తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, ఎన్నికల సంఘానికి అందజేసింది. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో నమోదైన తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన మొత్తం 37 కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపరిచింది. వీటిల్లో ఈవీఎంల విధ్వంస ఘటనలకు సంబంధించినవి 7, ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించినవి 30 కేసులు ఉన్నాయి.

పల్నాడు, తిరుపతి, అనంతపురంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 37 కేసులు నమోదైనట్టు సిట్‌ పేర్కొంది. వీటిలో ఏకంగా 32 కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపజేయలేదని సిట్‌ గుర్తించింది. ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు జోడిస్తూ న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించి ఆ సెక్షన్లు జత చేయించింది. 11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్‌ ఐపీసీ 307 పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదు. అందులో 7 కేసులు పల్నాడు జిల్లా పరిధిలో, 4 కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. 21 కేసుల్లో నేరపూరిత కుట్ర సెక్షన్‌ ఐపీసీ 120బీ పెట్టలేదు. అందులో 13 పల్నాడు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 19 కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లను, ఒక కేసులో ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం సెక్షన్‌లను, ఒక కేసులో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. ఇవే కాకుండా అనేక కేసుల్లో ఐపీసీ 143, 144, 145, 147, 148, 188, 448, 427, 506, 394 (బీ), 352 ,436, 452 రెడ్‌విత్‌ 149 వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఈ లోపాలను గుర్తించిన సిట్‌ వాటిని సరిదిద్దింది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్షపడేంత వరకూ జిల్లా ఎస్పీలు, రేంజి డీఐజీలు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ 7 కేసుల్లో మాత్రమే ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు తెలిపింది. ఇందులో రెండు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులున్నట్టు వెల్లడించింది. నిందితుల్ని ప్రశ్నించకపోవటంతో పాటు వారిపై సరైన సెక్షన్లు నమోదు చేయలేదని సిట్ తన నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది. నమోదైన ఎఫ్ఐఆర్​లలో మొత్తంగా 14 వందల 32 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో 12 వందల 45 మందిని గుర్తించినట్టు సిట్ పేర్కొంది.

డ్రోన్‌ కెమెరాలతో పల్నాడులో పోలీసుల పహారా! - Police Surveillance With Drone

మాచర్లలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 143, 147, 353, 452 రెడ్‌విత్‌/149, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 131, 135 సెక్షన్లను సిట్‌ సూచనతో పోలీసులు జత చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం గుండ్లపల్లె గ్రామంలో 170వ పోలింగ్‌ స్టేషన్‌లో సుమారు 60 మంది విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వీటికి అదనంగా ఐపీసీ 120బి, 188, 352, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125, 128, 132, 134 సెక్షన్లను వర్తింపజేయాలని సిట్‌ తేల్చడంతో తర్వాత దర్యాప్తు అధికారులు వాటిని చేర్చారు.

హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నా దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించనేలేదు. వెబ్‌కాస్టింగ్‌ ఫీడ్‌ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తుతెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులిచ్చారు. అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేశారు. ఆయా ఘటనల్లో పోలింగ్‌ బూత్‌ల్లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించాలని సిట్‌ పేర్కొంది. ఈ కేసుల్లో ప్రిసైడింగ్‌ అధికారుల నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందాలని దర్యాప్తు అధికారులను సిట్‌ ఆదేశించింది. ఈవీఎం టెక్నీషియన్లు, పోలింగ్‌ అధికారుల నుంచి సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్దేశించింది. గతంలో భయం వల్ల వాంగ్మూలం ఇవ్వటానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించాలని సిట్‌ సిఫార్సు చేసింది.


తాడిపత్రిలో పోలింగ్‌ రోజున 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ ఇరువర్గాల వారికి ద్విచక్రవాహనాల ర్యాలీలకు అనుమతిచ్చారని ఆ పర్యవసానమే అక్కడ తీవ్ర హింసాకాండకు దారి తీసిందని సిట్‌ స్పష్టంచేసింది. ఈ ఘటనల్లో పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారంది. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల పోలీసుల వాహనాలతో పాటు రాజకీయ నాయకులు, ప్రజల ఆస్తులూ, వాహనాలు ధ్వంసమయ్యాయని సిట్‌ తెలిపింది. కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో సాక్షుల్ని మళ్లీ విచారించాలని సిట్‌ నివేదించింది. తీవ్ర గాయాలైన వారి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ రిపోర్టులు సేకరించి ఆ మేరకు అవసరమైన సెక్షన్లను వర్తింపజేయాలని పేర్కొంది. సరైన దర్యాప్తు చేయాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమోలు జారీ చేసినట్టు పేర్కొంది.

పోలింగ్ రోజు టీడీపీ బూత్ ఏజెంట్లతో వల్లభనేని వంశీ గొడవ - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో - Vallabhaneni Vamsi Poll violence

ABOUT THE AUTHOR

...view details