Siddipet Traffic ACP Caught Drunk And Drive in Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని మధురానగర్ రోడ్డుపై ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ క్రమంలో తానో పోలీస్ అధికారినని ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కాడు. నడి రోడ్డుపై నానా రభస చేసి పోలీసు శాఖ పరువును బజారుపాలు చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.
సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సహా మరో ముగ్గురు మంగళవారం రాత్రి సఫారీ కారులో అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వైపునకు వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటాన్ని గమనించారు. వెంటనే తాగి డ్రైవింగ్ చేస్తున్న కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని పక్కకు ఆపి తన సీటు నుంచి కిందకు దిగి వెనక సీటులోకి వెళ్లాడు. వెనకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది.
వెనక సీట్లోని వ్యక్తే డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న అధికారులకు చెప్పారు. తనిఖీల్లో భాగంగా వారి కారును ఆపి వెనక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. అంతలో కారులోని వ్యక్తి కిందకు దిగి తాను సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అని, తమ కారు వదిలేయాలని హెచ్చరించాడు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని వదిలేయాలని బిగ్గరగా కేకలు వేశాడు.