PG Adjunct New Courses in Siddipet Govt Degree College :సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఎమ్మెస్సీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిషరీస్, ఎంఏ తెలుగు, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఎంకామ్ కోర్సులు కొనసాగుతున్నాయి. ఆయా కోర్సుల్లో 60 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. మెుత్తం 630 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, మైక్రోబయోలజీ కోర్సులు రావడంతో, ప్రథమ సంవత్సరంలో 120 సీట్లు భర్తీకి అవకాశం కల్పించారు.
సెప్టెంబర్ నుంచి పీజీలో ప్రవేశాలు మెుదలుకానున్నాయి. కొత్త వాటితో సహా మెుత్తం ప్రోగ్రామ్స్ సంఖ్య 12కి చేరడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో, బీకాం ఫైనాన్స్ అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఇంగ్లండ్‌లోని గ్లాస్గో యూనివర్సిటీతో ఎంవోయు కుదుర్చుకున్నారు. ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌తోపాటు ప్రతిభ కనబరిచిన వారికి ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకున్నారు.
పీజీ పూర్తవగానే ఉద్యోగ, ఉపాధి లభించేలా కోర్సుల రూపకల్పన : రెండేళ్ల కాల వ్యవధిలో కొనసాగే ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 20 కోర్సులు ఉంటాయి. అందులో డేటాబేస్ కాన్సెప్ట్స్, ఏఐ అప్లికేషన్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఫైనల్ సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాంగాణ నియామకాలూ చేపట్టనున్నారు. పట్టా అందుకుంటే ఐటీ కంపెనీలు, వారికి ఎర్రతివాచీ పరిచే అవకాశం ఉంది.
"గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనేక నూతనమైన ప్రోగ్రాంలను, విద్యార్థుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ కళాశాల రాష్ట్రంలోనే రెండు సార్లు ఏ గ్రేడ్‌ను, ఒకసారి ఏ ప్లస్ గ్రేడ్‌ను సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాలేజీపై దృష్టి కేంద్రీకరిస్తే, సిద్దిపేట మాత్రమే కాకుండా చుట్టుపక్కల విద్యార్థులు సైతం విద్యాఫలాలు అంది, ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు దోహదపడుతుంది."-సి.హెచ్ ప్రసాద్, ప్రిన్సిపల్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల