Aswaraopet SI Sriramulu Srinu Died : తెలంగాణలో సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సీఐ జితేందర్ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్ పనిలో సహకరించకపోవడమే కాకుండా కులం పేరుతో వేధించారని ఆత్మహత్యాయత్నం అనంతరం ఎస్సై శ్రీను ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల 30న స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన ఎస్సై శ్రీను ఎంతకు తిరిగి రాకపోయే సరికి అశ్వారావుపేట పోలీసులు గాలింపు చేపట్టారు. ఈలోగా ఆయనే 108కు ఫోన్ చేసి తాను మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన చెప్పారు. ఆ ప్రాంతానికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఆయనను హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఎస్సై శ్రీను చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సీఐ జితేందర్ రెడ్డిని వరంగల్ ఐజీకి, నలుగురు కానిస్టేబుల్స్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తన భర్త ఆత్మహత్యకు సీఐ జితేందర్, నలుగురు కానిస్టేబుల్స్ కారణమని ఎస్సై శ్రీరముల శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.