UOH Team New Research Revealed That Korralu is Best Food For Malnutrition : ఐదేళ్ల లోపు చిన్నారులు ఎవరైనా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లైతే వారికి కొర్రల ఆహారాన్ని తినిపించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధక బృందం తెలిపింది. డాక్టర్ ముతమిలరసన్, మరో ఆరుగురు సభ్యులు ఈ దిశగా చేసిన పరిశోధన విజయవంతమైంది.
ఈ పరిశోధన కోసం వీరు ఇక్రిశాట్ నుంచి 155 రకం, దిల్లీ నుంచి 185 రకం కొర్రలను తీసుకొచ్చారు. జీనోమ్ కోడ్ ఎడిటింగ్ ద్వారా 155 రకంలో 70 శాతం, 185 రకంలో 81 శాతం ఫైటిక్ యాసిడ్‌ను తగ్గించారు. ఆ తర్వాత కొత్తరకం వంగడాలను రూపొందించి సాగు చేశారు. ప్రయోగశాలలో వాటిని పరీక్షించగా ఫైటిక్ యాసిడ్ తగ్గినట్లు రుజువైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ పరిశోధనను ధ్రువీకరించింది.
చిన్నారులకు మేలు చేెస్తుంది : సాధారణంగా కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఫైటిక్ యాసిడ్ తగ్గితే ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. దీంతో పాటు చిన్నారుల్లో పోషకాహారలేమిని నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రల ప్రయోజనాలపై డాక్టర్ ముతమిలరసన్ బృందం మూడేళ్లుగా పరిశోధనలు చేస్తోంది.
వివిధ దేశాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్యను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) 2023లో ఒక నివేదికలో వెల్లడించింది. ఈ విధంగా ఐదేళ్లలోపు వయసు చిన్నారులు భారత్‌లో 5.32 కోట్ల మంది ఉన్నారని పేర్కొంది. దీని ఆధారంగా డాక్టర్ ముతమిలరసన్ బృందం తమ పరిశోధనను పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా మార్పు చేసింది.
"మిల్లెట్ సూపర్ ఫుడ్" - ప్రముఖ వైద్యులు ఏమంటున్నారంటే!
వీరు రూపొందించిన ఈ కొర్రలను చిన్నారులకు ఉప్మా, జావ తరహాలో వారంలో మూడురోజులు ఒక్క పూట మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల పాటు ఇలా తినిపిస్తే వారిలో పోషకాహార లోపం తగ్గి ఇతరుల మాదిరిగానే ఎదుగుతారని పరిశోధకులు తెలిపారు. కొత్త కొర్ర వంగడాల సాగుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నుంచి అనుమతి రాగానే రెండేళ్లలో మార్కెటింగ్ చేయనున్నారు.