Shivaratri Arrangements in Temple :మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. విజయవాడ యనమలకుదురులో రామలింగేశ్వర ఆలయంలో అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని హేమాపురం సిద్దేశ్వరాలయం శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లా ముక్తేశ్వరం ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొగరపాయ వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా నీటి సౌకర్యం కల్పించారు. శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.
దేశంలో ఉన్న హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలా ఎంతో విశిష్టత ఉన్న ఆలయాల్లో ఈ సిద్దేశ్వరాలయం ఒకటి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన హేమావతి సిద్దేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. క్రీ.శ. 730లో నొళంబ రాజులు నిర్మించి నట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా లింగాకారంలో పరమశివుడు దర్శన మిస్తాడు.
ఇక్కడ మాత్రం మానవ రూపంలో గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్దేశ్వరుడి జటాజుటాన సూర్య, చంద్రులు కనిపిస్తారు. ఎడమ చేతిలో బ్రహ్మ కపాలాన్ని, కుడి చేతిలో జపమాలను ధరించి అర్ధనిమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి. శివుడు విగ్రహ రూపంలో ఆశీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలోనే ఇదొక్కటేనని చరిత్ర చెబుతోంది. సూర్యాస్తమయ సమయంలో స్వామినుదుటిపై సూర్య కిరణాలు పడి ఆలయంలో వెలుగులు విరాజిల్లడం ఇక్కడి విశేషం. ఇక్కడ శివుడు పీఠంపై సిద్ధాసనంలో కూర్చొని ఉండటంవల్ల సిద్దేశ్వర స్వామి అని పిలువబడుతున్నారు.