Sheep Distribution Scam Case in Telangana : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారులు పశుసంవర్ధకశాఖకు చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు అంజిలప్ప, సహాయ సంచాలకులు కృష్ణయ్యలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రైతుల నుంచే గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను సేకరించాలని జీవో జారీ చేసి కొన్ని సూచనలను పొందుపరిచింది. అయినా వాటిని లెక్క చేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు గుత్తేదారులతో కలిసి కుమ్మకైనట్టు ఏసీబీ(ACB) దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
గొర్రెల పంపిణీ నిధుల గోల్‌మాల్‌లో ఉన్నతాధికారుల ప్రమేయం - రంగంలోకి ఏసీబీ
ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిపారని ప్రభుత్వ అధికారులు నింపాల్సిన అన్ని దరఖాస్తు ఫారాలను ప్రైవేటు ఉద్యోగుల ద్వారా నింపి బ్యాంకు ఖాతాలకు బినామీల వివరాలను జత చేశారని విచారణలో తేలింది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ఉద్దేశపూర్వకంగానే నకిలీ బినామీ వివరాలనుకలెక్టర్‌కు పంపారని ఏసీబీ వెల్లడైంది. ప్రభుత్వ ఖజానాకు రూ.2.10 కోట్లు నష్టం జరిగిందని అధికారులు తేల్చారు.