200 Jailed For Harassing Women During Ganesh Immersion :బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను టీజ్ చేసిన అకతాయిల భరతం పడుతోంది షీ టీమ్స్. రద్దీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి వారితో ఊచలు లెక్కపెట్టిస్తోంది. ఇటీవల గణపతి నవరాత్రుల్లో మహిళలతో 996 మంది అసభ్యంగా ప్రవర్తించిన వారిని షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా అందులో 200మంది ఆకతాయిలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. వారికి కోర్టు మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించింది. మిగతా వారికి పోలీస్ స్టేషన్లోనే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
- ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది ఆకతాయిలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మహిళా సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీమ్స్ నిఘా కొనసాగుతుందని ఆమె తెలిపారు.
పోలీసుల నుంచి కాల్ వచ్చే వరకు తెలియదు : చాలామంది యువకులు తమ ఇంట్లో బుద్ధిమంతులుగా ఉంటూ బయటకు రాగానే వేరే అవతారం ఎత్తుతారు. నిజం చెప్పాలంటే అపరిచితులుగా మారిపోతారు. ఇంట్లో రాములా బయటకు రాగానే రెమోగా అమ్మాయిల వెనుక తిరుగుతారు. కానీ వాళ్ల తల్లిదండ్రులకు మాత్రం వీళ్లు చేసే ఘనకార్యాలు ఏమీ తెలియవు.