She Team Arrest Eve Teasing Persons in Hyderabad: పోకిరీల వేధింపుల బారిన పడుతున్న మహిళలు, యువతులకు షీ బృందాలు అండగా నిలుస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు స్వీకరించగానే కార్యాచరణ చేపట్టి నిందితుల ఆగడాలను అరికడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేసి వారిని పట్టుకుంటున్నారు. అవసరమైతే డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి చర్యలు చేపడుతున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు.
She Team Cases in Rachakonda April Month : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో 133 మంది పోకిరీలను పోలీసులకు పట్టుకున్నారు. గత నెల 16- 30 తేదీల మధ్యలో పోలీసులకు వేధింపులపై 148 ఫిర్యాదులందాయి. ఫోన్ల ద్వారా మహిళలను 17 మంది వేధించగా, సామాజిక మాధ్యమాల్లో 38 మంది, నేరుగా 93 మంది పోకిరీలు వేధింపులకు పాల్పడ్డారు. వీరిలో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, 92 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. 40 మంది పోలీసు అధికారులు, నిపుణుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
లవ్ చేస్తానని మోసం చేసిన నిందితుడు : వనస్థలిపురం ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ఆమెతో పని చేసే వ్యక్తి తనతో స్నేహం చేసి పూర్తి విషయాలు తెలుసుకొని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా ఫొటోలు తీశాడు. కొన్ని రోజుల తరువాత ఆమె పెళ్లి చేసుకొమని అడిగితే దానికి నిరాకరించాడు. ఫొటోలను ఆమె బంధువులకు పంపిస్తానని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు షీ బృందాల ఆశ్రయించడంతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.