Shared Ownership Of Property among Family Members : భూ యజమానులు వారి కుటుంబ సభ్యులకు భూమి యాజమాన్య హక్కులను బదిలీచేస్తున్న తీరు క్రమంగా పెరుగుతోంది. ఇంట్లోని ప్రతి ఫ్యామిలీ మెంబర్‌పై కొంత సాగు భూమి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కారు అమలు చేసేటువంటి రైతు బీమా గిఫ్ట్‌లకు ఒక కారణమైతే సులువుగా హక్కుల బదిలీ ప్రక్రియ ఉండటం కూడా భూ యజమానులు మొగ్గు చూపించేందుకు మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు బ్యాంకు పూచీకత్తు(గ్యారంటీ) తదితరాలకు భూమి కీలక ఆధారంగా మారుతుండటం వల్ల కుటుంబ సభ్యులపై కొంత విస్తీర్ణమైనా ఉండాలని భావిస్తున్నారు. దీంతో గిఫ్ట్ డీడ్‌ల సంఖ్య పెరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. 2020కి ముందు సంవత్సరానికి 70 వేల నుంచి 80 వేలలోపు దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఆ తరువాత వీటి సంఖ్య ఏటా లక్ష దాటుతోంది.
అభ్యంతరాలు తక్కువనే కారణంతో :కుటుంబంలో ఒకప్పుడు ఇంటి యజమాని పేరున మాత్రమే భూమి అంతా ఉండాలని భావించేవారు. కానీ కాలక్రమేణా ఈ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఒక యజమాని తనకు ఉన్న భూమిని ఎవరైనా కుటుంబ సభ్యుడికి ఇవ్వాలంటే భాగం పంచాలి. కానీ ఈ ప్రక్రియలో పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. కుమారులు, కుమార్తెలు ఉంటే వారందరినీ ఒప్పించాలి. వారిలో ఎవరు అభ్యంతరం చెప్పినా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉండదు.
కానీ గిఫ్ట్‌డీడ్(బహుమతి) అయితే ఎవరి అభ్యంతరం ఉండదు. యజమాని తాను కోరుకున్న వాళ్లకు ల్యాండ్(భూమి)ను రాసిచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా గిఫ్ట్‌డీడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గిఫ్ట్ డీడ్ మినహా ఇతర లావాదేవీల్లో రిజిస్ట్రేషన్- మ్యుటేషన్‌కు అమ్మేవారితో పాటు, కొనుగోలుదారులతో పాటు నలుగురు సాక్షులు హాజరు కావాల్సి ఉంటుంది. గిఫ్ట్ డీడ్ ప్రక్రియలో భూయజమానితో పాటు బహుమతి పొందే వ్యక్తి, ఇద్దరు సాక్షులు ఉంటే చాలు.