POCSO Act :మనతోనే ఉంటారు. పక్కనే తిరుగుతుంటారు. కరుణను కురిపిస్తుంటారు. ప్రేమగా మాట్లాడుతుంటారు. మన వాళ్లేలనని నమ్మారో ఇక అంతే సంగతులు. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త మృగాళ్లున్నారు. చాక్లెట్ కొనిస్తానని నమ్మించి నలిపేయాలనిప్రయత్నించాడు ఒకడు. చిన్నారన్న కనికరం కూడా లేకుండా లైంగిక దాడికి మరో నీచుడు పాల్పడ్డాడు. 8 ఏళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డాడో దుర్మార్గుడు. చదువుకునే పాఠశాలల్లో ప్రిన్సిపల్ భర్త రూపంలో కాటేయాలని చూశాడో కామాంధుడు. ఇలా అడుగడుగునా మృగాళ్లు చిన్నారులను కాటేస్తున్నారు. తాజాగా వైఎస్‌ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలోని ఓ గ్రామంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. వరుసకు చిన్నాన్న అయిన వ్యక్తి కూతురి లాంటి 6 చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
చిన్నారులపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఓ వైపు శిక్షలు పడుతున్నా మృగాళ్లు కళ్లు తెరవడం లేదు. లైంగిక దాడులతో చిన్నారుల జీవితాలను నలిపేస్తున్నారు. కొంత మంది బయటకు చెప్పుకుంటున్నారు. మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందని ఆగిపోతున్నారు. పిల్లలు బయట తిరగడం కష్టం అవుతుందని బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కామాంధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులపై కఠిమైన చర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు ఉరి వేసేలా కఠిన శిక్షలు అమలు చేయాలని పేర్కొంటున్నారు.
స్కూల్కు వెళ్లనని చిన్నారి మారాం - అసలు విషయం తెలుసుకొని తల్లి షాక్! - Teacher Misbehaved With Girl
ఇటీవల నమోదైన పోక్సో కేసుల వివరాలివి :అయిదేళ్ల బాలికపై పదో తరగతి విద్యార్థి అత్యాచారానికి యత్నించిన సంఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఓ కల్యాణ మండపం వద్ద 8 బాలికపై హత్యాచారం జరిగింది. ఈ సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో నిందితుడైన రఫీకి కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే ప్రాంతంలో ఉండే యువకుడు అత్యాచారానికి ప్రయత్నించారు. బాలిక కేకలు వేయడంతో కాలనీవాసులు అడ్డుకుని అతనికి దేహశుద్ధి చేశారు.
అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన రెడ్డెప్ప (55) అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్లాడు. బడి చూస్తూ ఉండమని కార్యకర్త తన వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లింది. అదే అదను అనుకుని కామాంధుడు ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో లక్కిరెడ్డిపల్లిలోని ఓ బాలికల గురుకులంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ భర్త ఫూల్గా తాగి వచ్చి 5వ తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా 10వ తరగతి, ఇంటర్ చదివే విద్యార్థుల స్నానాల గదుల్లోకి దౌర్జన్యంగా వెళ్లి వారిని నగ్నంగా సెల్‌ఫోన్‌లో చిత్రించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపల్, ఆమె భర్తతో పాటు మరో ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఏది గుడ్ టచ్, ఏదీ బ్యాడ్ టచ్ - పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది మీరే! ఇవిగో కొన్ని చిట్కాలు - Good Touch Bad Touch Instructions
అలాంటి వారితో భద్రం :అసభ్యంగా మాట్లాడడం. అదే పనిగా చూడడం. విచిత్రంగా వ్యవహరించడం. చరవాణుల్లో విచిత్రమైన సందేశాలు పంపించడం. శరీరంపై వేయరాని చోట్ల చేతులు వేయడం. కావాలనే తాకడం. రెండు అర్థాలు వచ్చే విధంగా మాట్లాటే వారితో పట్ల జాగ్రత్తగా ఉండాలి. మద్యం, గంజాయి మత్తులో ఉండే వారు, ఇది వరకే పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అనుమానాలు ఉన్న వారిని దగ్గరకు రానివ్వకూడదు. తమ పిల్లలను చూస్తూ ఉండమని చెప్పి తల్లిదండ్రులు బయటికి వెళ్తారు. చిన్నారులను పక్కింటి వారి ఇంట్లో వదిలిపెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మనకు తెలిసిన వారు కదా, పైగా పెద్దలు వారు కదా అని నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుతం జరుగుతున్న దారుణాల్లో చాలా వరకు వయస్సు పైబడిన వారే చేస్తున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అవగాహనే ముఖ్యం : గుడ్ టచ్. బ్యాడ్ టచ్ అనే విషయాలపై ఎలాగో పాఠశాలల్లో, కళాశాలల్లో అధ్యాపకులు చెబుతుంటారని కడప మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు. కానీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇలాంటి వాటిపై పెద్దగా అవగాహన ఉండదని తెలియజేశారు. కావున ఐసీడీఎస్ (ICDS) అధికారులు, మహిళా పోలీసులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. చిన్నారుల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. తెలిసిన వారే కదా అని మనం నిర్లక్ష్యం వహిస్తే నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
హాస్టల్ ముసుగులో బాలికలపై లైంగిక దాడి - ముగ్గురు అరెస్ట్ - sexual harassment case in eluru
చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. ఇటీవల మారిన చట్టాల ప్రకారం పోక్సో కేసు నమోదైతే డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాల్సి ఉంటుంది. 30 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. 60 రోజుల్లో ఛార్జ్జిషీటు వేయాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరంలో తీర్పు వచ్చేలా చట్టం సవరణ చేశారు. మారిన చట్టం ప్రకారం నిందితులకు సత్వరం శిక్ష పడుతుంది. చిన్నారులపై అఘాయిత్యం చేసే వారిపై కఠిన చర్యలుంటాయి- కొండయ్య నాయుడు, డీఎస్పీ, మదనపల్లె
చట్టంలో కఠిన శిక్షలున్నాయ్ :బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో చట్టం) కేసు నమోదైతే శిక్షలు కఠినంగా ఉంటాయని మదనపల్లెకు చెందిన న్యాయవాది బాలజ్యోతి పేర్కొన్నారు. 3-20 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడుతుందని తెలియజేశారు. దీంతో పాటు ఒక్కోసారి ఉరి శిక్ష, జీవితఖైదు శిక్ష ఇలా రెండు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేరంలో బెయిలు ఇచ్చే అవకాశం కూడా ఉండదని పేర్కొన్నారు. కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఇలాంటి కేసులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అందులో బాధితులను విచారణ చేసే సమయంలో చిన్నారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూస్తారని తెలిపారు. ఒకసారి కోర్టుకు వచ్చి వివరాలు చెప్పిన తర్వాత చిన్నారి కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై అఘాయిత్యం జరిగితే పోక్సో కేసులు నమోదు అవుతాయని తెలియజేశారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను వక్ర మార్గంలో చూడటం, లైంగికంగా దాడి చేయడం లాంటి సంఘటనలకు పోక్సో చట్టం వర్తిస్తుందని తెలిపారు.
ఏలూరు జిల్లాలో వార్డెన్ భర్త ఆకృత్యాలు - ఫొటోషూట్‌లంటూ బాలికలపై లైంగిక దాడి - Eluru Girls Hostel Incident