'కారూ కారూ ఎందుకు మీ గల్లీలో నుంచి మా గల్లీలోకి కొట్టుకొచ్చావంటే? వరద నీరు నన్ను మోసుకొచ్చిందని చెప్పిందట. వరదా వరదా మా గల్లీకి ఎందుకొచ్చావంటే నా కోసం పైపు లైన్ లేదని చెప్పిందట పైపు లైన్ పైపు లైన్ ఎందుకు లేవని అడిగితే పైసలు లేక నన్ను నిర్మించలేదని అందట.' ఈ మాటలు వినడానికి చమత్కారంగా ఉన్నా వాన పడితే కృష్ణానగర్ జనాల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏళ్ల తరబడి వరద, మురుగు నీటి సమస్యతో నరకం అనుభవిస్తున్నారు.
Rain Water Effect In Krishna Nagar :కాలం ఏదైనా సరే వర్షం పడితే కృష్ణానగర్ ప్రాంతంలో వరద నీరు పోటెత్తుతుంది. దానికి మురుగు తోడవడంతో వీధుల్లో నడవాలంటే నరకయాతన తప్పదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో వరద నీటి సమస్య అక్కడి ప్రజలకు కన్నీటి కష్టంగా మారింది. ఇక్కడి ఏబీసీ బ్లాక్‌లు నిత్యం ముంపునకు గురవుతున్నాయి. చిన్న చినుకుపడ్డా, పెద్ద వాన కురిసినా వీధుల్లో నుంచి మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తుంది.
రహదారులపై ప్రవహిస్తున్న మురుగునీరు :ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే సమస్య ఎదురవుతుండటంతో స్థానికులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని గమనించగా కృష్ణానగర్ వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా అనిపించాయి. ఇళ్లు, దుకాణాల ముందు పేరుకుపోయి బురద, రహదారులపై దుర్గంధంతో పారుతున్న మురుగు నీరు వెరసి కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి కృష్ణానగర్ వీధుల్లో నెలకొంది. అంతేకాకుండా వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరకుండా అడ్డుగోడలు కట్టుకున్నారు.
డ్రైనేజీలు ఉండాల్సిన స్థలంలో ఇళ్లు :గత అనుభవాల దృష్ట్యా వరద ఉద్ధృతికి తమ విలువైన వాహనాలు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఇంటి గేట్లకు, షట్టర్లకు ద్విచక్రవాహనాలను తాళ్లతో కట్టేశారు. మురుగు నీరు ప్రవహించాల్సిన నాలాలు మూసుకుపోయాయి. అక్కడక్కడ నాలాలపై భవనాలు నిర్మించి అద్దెక్కిచ్చారు. మరోవైపు ప్రధాన వీధిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు.
కమ్యునిటీహాల్ వీధిలోని దుకాణ సముదాయాల్లోకి వరదనీరు చేరడంతో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. వరదనీటిని రోడ్డుపైకి తోడేశారు. బి-బ్లాకులోని సాయికిరణ్ పాఠశాల వద్ద ఉన్న మ్యాన్‌హోల్ పొంగుతుండటంతో 24 గంటలపాటు మురుగునీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. బి-బ్లాకులో వరద నీటి ఉద్ధృతికి రెండుచోట్ల మ్యాన్ హోళ్లు దెబ్బతినడంతో ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేశారు.
సమస్యకు మూలం అక్కడే :అయితే ఈ సమస్య ఎక్కడ మొదలైందని ఆరా తీయగా ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, గాయత్రీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు లోతట్టు ప్రాంతాలైన కృష్ణానగర్ ఏబీసీ బ్లాకులలో ప్రవహిస్తుంది. వరద నీరు సాఫీగా సాగడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, రహదారులన్నీ సీసీ రోడ్డుగా మారడంతో వరద నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేదు.
వరదనీటిలో కొట్టుకుపోయిన కారు :ఇంకుడు గుంతలు లేకపోవడం, దానికితోడు వరద నీటి కాలువలు కొన్నిచోట్ల కబ్జాలకు గురికావడంతో ఆ నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో చిన్నగా ఉన్న సమస్య క్రమంగా పెను సమస్యగా మారింది. సత్వరమే పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కృష్ణానగర్ వరదనీటి సమస్య మరింత జఠిలంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు సి-బ్లాకులో పార్కింగ్‌లో ఉన్న ఓ కారు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. సింటెక్స్ నీటి ట్యాంకులు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.