Serial Killer Murders In Telangana :అతడో నరరూప రాక్షసుడు. తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు. జైలు నుంచి విడుదలైన 11 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్దారించారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ (29) అరాచకానికి యాదగిరిగుట్ట రైల్వేస్టేషన్‌లో తెలుగు మహిళ రమణమ్మ బలయ్యారు. ఆమెను హత్య చేసి సొంత రాష్ట్రం పారిపోయే క్రమంలో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇతడి అఘాయిత్యాలు వెలుగుచూశాయి. కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రైల్వేస్టేషన్లలో ఐదుకు పైగా హత్యలకు పాల్పడినట్టు గుర్తించారు.
నైలాన్ తాడు మూడంగులాల కత్తి. రెండు నెలలు ఐదు హత్యలు. చెప్పాలంటే రాహుల్ జాట్ ఒక సైకో కిల్లర్. అసలు పేరు భోలు కర్మవీర్ ఈశ్వర్‌జాట్. హర్యానా రాష్ట్రానికి చెందిన ఇతడికి ఐదోఏట పోలియో బారినపడటంతో ఎడమకాలికి వైకల్యం ఏర్పడింది. చదువు అబ్బకపోవటంతో కూలీపనులు చేస్తుండేవాడు. 2018-19లో ట్రక్ దొంగతనం, అక్రమ ఆయుధాల రవాణాపై రాజస్తాన్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసులో జోద్‌పూర్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
అత్యాచారానికి పాల్పడి హత్య : జైలు నుంచి విడుదలయ్యాక ఈ నెల 14న గతంలో పనిచేసిన హోటల్‌లో జీతం తెచ్చుకునేందుకు లోకల్ రైలులో ఉద్వాడ చేరాడు. ఉద్వాడ రైల్వేస్టేషన్ దిగిన రాహుల్ రైల్వేట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళుతున్న యువతిని చూశాడు. బీకామ్ చదువుతున్న ఆ యువతి ఫోన్ మాట్లాడుతూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన మృగాన్ని గమనించలేకపోయింది. తేరుకునేలోపుగానే అతడు యువతి గొంతుకు తాడు బిగించి, పక్కనే ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని దుకాణానికి వెళ్లి పాలు, నీళ్ల సీసాలు కొనుక్కొని వచ్చి మళ్లీ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లోపు అలికిడి కావడంతో తన సంచి అక్కడే వదిలేసి పారిపోయాడు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతదేహం సమీపంలో సంచిని స్వాధీనం చేసుకున్నారు. దానిలో దుస్తులు, ఒక నైలాన్ తాడు, కత్తిని గుర్తించారు. వాటి ఆధారంగా నిందితుడు రైళ్లలో ప్రయణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. చుట్టుపక్కల రైల్వేస్టేషన్లలోని 5వేల సీసీటీవీ కెమెరాలు జల్లెడ పట్టారు. చివరకు ఉద్వాడ రైల్వేస్టేషన్‌లో కుంటుకుంటూ వెళుతున్న వ్యక్తి వెనుక తగిలించుకున్న సంచి, మృతదేహం వద్ద దొరికిన సంచి ఒకేలా ఉండటంతో అనుమానితుడి ఫోటోను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లకు పంపారు. చివరకు సూరత్‌లోని లాజ్‌పురా జైలు అధికారులు అతడు గతంలో తమ దగ్గర శిక్ష అనుభవించిన రాహుల్‌గా గుర్తించారు. అదే సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడంతో నిందితుడు ఎవరన్నది తేలింది.