Indiramma Household Survey in Telangana:తెలంగాణప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికలో భాగంగా యాప్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసింది. అయితే సొంత ఇంటి స్థలం కలిగిఉండి పెంకుటిళ్లలో ఉంటున్న వారినుంచే ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వానికి మొత్తం 80.54 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఆయా దరఖాస్తుదారుల ఇంటికి నేరుగా సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 31.58 లక్షల మంది దరఖాస్తుదారులను సర్వే చేశారు. వీటిలో సుమారు 9.19 లక్షల మందికి సొంత స్థలాలున్నట్లు గుర్తించారు. అయితే వారిలో దాదాపు 2.35 లక్షల మంది పెంకుటిళ్లలోనే నివాసం ఉంటున్నారు.
1.86 లక్షల మంది జీఐ రేకుల ఇళ్లలో, మరో 2.17 లక్షల మంది సిమెంట్ రేకుల ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అదేవిధంగా శ్లాబ్ గృహాల్లో 1.22 లక్షల మంది ఉంటున్నారు. మట్టి మిద్దెల్లో 69,182 మంది, టార్పాలిన్లు/ప్లాస్టిక్ కవర్లతో కప్పిన ఇళ్లలో 41,971 మంది నివాసం ఉంటున్నారు. గుడిసెల్లో 34,576 మంది. అలాగే పెంకులు పగిలిపోవడంతో టార్పాలిన్ కవర్లు కప్పిన ఇళ్లలో 12,765 మంది ఉంటున్నట్లు వెల్లడైంది. అయితే మొదటి దశలో సొంతస్థలాలు ఉన్నవారికే ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిళ్లు,మట్టిమిద్దె, గుడిసెళ్లెలో ఉంటున్న దరఖాస్తుదారులకు.. అందులోనూ దివ్యాంగులు, వితంతువులను ప్రాధాన్యక్రమంలో గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.
గుడ్న్యూస్ - ఇందిరమ్మ ఇళ్ల కోసం 'యాప్' - లబ్ధిదారుల ఎంపిక ఎప్పటినుంచి అంటే?