Seize the Ship Issue: కాకినాడ తీరంలోని స్టెల్లా ఎల్ నౌకలో సేకరించిన బియ్యం నమూనాల పరీక్షలపై ప్రతిష్టంభన నెలకొంది. జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల సంస్థ ల్యాబ్‌లో నమూనాలు పరీక్షించాల్సి ఉన్నా ఆ ఊసేలేదు. సేకరించిన బియ్యం నమూనాలు ఎక్కడ ఉన్నాయి? వారం గడచినా పరీక్షలు ఎందుకు చెయ్యలేదు? ఈ జాప్యానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నవంబర్ 27న స్టెల్లా ఎల్ నౌకలో తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ అందులో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్టు తేల్చారు. అదే నెల 29న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టు సందర్శించి లోపాలను ఎత్తిచూపుతూ ” సీజ్ ద షిప్" అంటూ ఆదేశించారు. ఈ క్రమంలో లోతుగా విచారణకు 5 శాఖలతో బృందాన్ని కలెక్టర్ నియమించారు. డిసెంబర్ 4న నౌకలో తనిఖీ చేసిన అధికారుల బృందం, నౌకలోని 32 వేల 415 టన్నుల బియ్యం నుంచి 36 నమూనాలు సేకరించింది.
అదేరోజు అర్థరాత్రి దాటాక విచారణ కమిటీ బృంద సారథి గోపాలకృష్ణ నమూనాలను కలెక్టర్‌కు అప్పగించారు. విచారణ బృందం సేకరించిన నమూనాల్లో పలు సంస్థల బియ్యం నిల్వలు ఉన్నాయి. ఆయా నమూనాలకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పరీక్షలు జరగాల్సి ఉన్నా ఇప్పటికీ కదలిక లేదు. పరీక్షల్లో జాప్యానికి కారణాలేంటన్న చర్చ నడుస్తోంది. అలాగే పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కోటోగౌ పోర్టుకు వెళ్లాల్సిన స్టెల్లా ఎల్ నౌక కదలికపైనా సందిగ్ధత నెలకొంది.