Freehold Land Scam in AP : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా నాటి అరాచకాలు, అక్రమాల చిట్టా ఇంకా బయటపడుతూనే ఉంది. ఏకంగా అప్పటి సీఎం భార్య బినామీ పేరిట కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ బాగోతం తాజాగా వెలుగు చూడటం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాటి సబ్‌రిజిస్ట్రార్ స్వయంగా రాసిన లేఖతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఎలాంటి పత్రాలూ, ఆధారాలు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయినట్లు తేటతెల్లమవుతోంది.
ఇలా నాటి ప్రభుత్వ పెద్దలు, వారి బినామీల పేరుతో నాడు విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలులోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఫ్రీహోల్డ్ ముసుగులో 22ఎ నిషిద్ధ జాబితాలోని భూములను తొలగించి వేల ఎకరాలు కాజేశారు. నయానో భయానో సబ్‌రిజిస్ట్రార్లనూ దారికి తెచ్చుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చీమకుర్తి శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరిగిన అక్రమ భూ లావాదేవీల ఘటన గత సర్కార్‌లో జరిగిన వేల అక్రమ రిజిస్ట్రేషన్లలో ఒకటి మాత్రమే.
ఇలాంటి లావాదేవీలు మరెన్నో! : అక్రమాస్తుల కేసులో అరెస్టైన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నాటి సబ్ రిజిస్ట్రార్ లాలా బాలనాగ ధర్మసింగ్ భయపడిపోయి చంద్రబాబుకు లేఖ రాయడంతో ఈ వ్యవహారమైనా వెలుగులోకి వచ్చింది. బయటకు రాని ఇలాంటి లావాదేవీలు మరెన్నో! శ్రీకాంత్ మరెవరో కాదు మాజీ సీఎం భార్యకు బినామీ అని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది. అక్రమ లావాదేవీలు జరిగిన ఆస్తుల విలువ రూ.106 కోట్లు ఉంటుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేశారు. శ్రీకాంత్ భార్య, తండ్రి, ఇతర కుటుంబసభ్యుల పేర్లతో మరెన్నో ఆస్తుల లావాదేవీలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. అంటే ధర్మసింగ్ తన లేఖలో పేర్కొన్నట్లు ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.700 కోట్లు ఉంటుంది.
గత సర్కార్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొత్తం ఆస్తుల విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తే మరెన్నో అక్రమాలు వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు బయటపడతాయి. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్‌కు ఎలాంటి గతి పట్టిందో మీకూ అదే గతి పడుతుందంటూ బెదిరించి ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ధర్మసింగ్ పేర్కొనడం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున భూలావాదేవీలు జరిగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారుల విచారణలోనూ ఈ విషయాలు నిజమేనని తేలింది. లింకు డాక్యుమెంట్లను కూడా ఒకే రోజు రిజిస్టర్ చేసినట్లు వెల్లడైంది. వీటిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
YSRCP Land Irregularities : పేదల వద్ద ఉన్న ఎసైన్డ్ భూములు, 22ఎ నిషిద్ధ జాబితాలోని భూముల్ని కొల్లగొట్టేందుకే గత ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలకు తెరతీశారు. 2023 డిసెంబర్ 19న తెచ్చిన జీవో ద్వారా 2003కు ముందు ఇచ్చిన ఎసైన్డ్ భూముల్ని ఫ్రీహోల్డ్ చేసి పేదల నుంచి కొల్లగొట్టారు. అధికారబలంతో 2003 తర్వాత ఇచ్చిన భూముల్ని కూడా నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. ఇలా మొత్తం 13.59 లక్షల ఎకరాల ఎసైన్డ్, ఇనాం, చుక్కలు, షరతుగల పట్టా భూములను 22ఎ నుంచి తప్పించారు.
10 లక్షల ఎకరాలకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించగా 3.86 లక్షల ఎకరాలను అక్రమంగా తొలగించినట్లు తేలింది. వీటి విలువ రూ.వేల కోట్లలో ఉంటుంది. నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన చుక్కల భూములే 1.94 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో చోటు చేసుకున్న అక్రమ భూలావాదేవీలను సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి ఒక్క రోజులోనే బయటకు తీశారు. కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అక్రమాలను బయటకు తీయడమూ పెద్ద పనేం కాదు.
కొండ, బండ అనే తేడా లేదు - వైఎస్సార్సీపీ నాయకుల అంతులేని భూకబ్జాలు - YSRCP Leaders Land Encroachment