Security Holograms Printed on Liquor Bottles During YSRCP Govt :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు రాష్ట్ర సీఐడీని ప్రతివాదిగా చేరుస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హోలోగ్రామ్‌ల తయారీ, సరఫరా టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వి.శివరామన్ 2021లో హైకోర్టులో పిల్ వేశారు. కుంభత్ హోలోగ్రాఫిక్స్ సంస్థకు టెండర్ కట్టబెట్టేందుకు భారీగా సొమ్ము చేతులు మారిందన్నారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.