తెలంగాణ

telangana

ETV Bharat / state

సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట - బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన - SC On MLC Kavitha Petition - SC ON MLC KAVITHA PETITION

SC On MLC Kavitha Petition : దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను రాజ్యాంగ చట్టబద్ధతపై దాఖలైన మరో కేసుతో కలిపి విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది.

KAVITHA
KAVITHA

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 11:01 AM IST

Updated : Mar 22, 2024, 1:23 PM IST

SC On MLC Kavitha Petition : దిల్లీ మద్యం కేసులో తనను ఈడీ అరెస్ట్‌ చేయడం అక్రమంటూ సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Delhi Liquor Scam Updates :ప్రస్తుత పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయని కవిత(MLC Kavitha on ED Arrest) తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆయనను భావోద్వేగానికి గురికావొద్దని వారించారు. ఈ కేసులో కవితను ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారన్న కపిల్ సిబల్‌, ఒక్క బలమైన సాక్ష్యం లేకుండా దర్యాప్తు సాగుతోందన్నారు. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని న్యాయస్థానానికి వివరించారు.

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ

ఇందులో తాము బెయిల్ ఇవ్వలేం : ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందులో తాము బెయిల్‌ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని పేర్కొంది. ఆ స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందన్న ధర్మాసనం త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్‌ కోర్టుకు సూచనలు చేసింది. ఈ పిటిషన్‌లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందున దీన్ని ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జతచేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగ పరమైన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

ఆప్​ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారు : ఈడీ​

అసలేం జరిగిదంటే : దిల్లీ మద్యం కేసులో తన అరెస్టు చట్టాల ఉల్లంఘనతో పాటు ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందని తెలిపారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని చూపలేదని, అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని వెల్లడించారు. దిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పిటిషన్‌లో వివరించారు.

కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు - కస్టడీ ఉత్తర్వుల్లో రౌజ్‌అవెన్యూ కోర్టు న్యాయమూర్తి

కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు - కస్టడీ ఉత్తర్వుల్లో రౌజ్‌అవెన్యూ కోర్టు న్యాయమూర్తి

Last Updated : Mar 22, 2024, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details