Saptagiri Arrangements for Srivari Navahnika Brahmotsavam : శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా, వారు సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాల నేపథ్యంలో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
శోభాయమానంగా తిరుమల : తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్తు వెలుగులతో ధగధగలాడుతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు పూర్తి చేశారు. కల్యాణ వేదికలో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా సీతా స్వయంవరం, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడుకొండలపై శ్రీనివాసుడు పవళించిన నమూనా సిద్ధం చేశారు. శ్రీవారి ఆలయం, దేవతా ప్రతిమలు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
- బందోబస్తుకు 5,145 పోలీసులని వినియోగించనున్న, టీటీడీ సెక్యూరిటీ. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతుల నియంత్రణకు సైబర్‌క్రైమ్ పోలీసుల ద్వారా ప్రత్యేక చర్యలు.
- గరుడసేవ రోజు రద్దీ ఎక్కువైతే తిరుపతి నగర శివారులో ఐదు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు భక్తుల రవాణా జరుగుతుంది.
- 2,700 అత్యాధునిక సీసీ కెమెరాలు, నిఘా నియంత్రణ కేంద్రాలతో నిరంతర పర్యవేక్షణ. ఈ సంవత్సరం నూతనంగా ‘వీడియో ఎనలైజింగ్ టెక్నాలజీ’ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్యాలరీల్లో 2 లక్షలు మంది భక్తులు వాహన సేవలు వీక్షించనున్నారు. అదనంగా నాలుగు మాడవీధుల్లోని మూలల వద్ద మరో 80 వేల మందికి అవకాశం కల్పిస్తున్నారు.
- తిరుమలలో 24 పార్కింగ్ ప్రాంతాలు, తిరుపతిలో మరో ఐదు ఏర్పాటు చేశారు. తిరుమలకు ఎనిమిది వేల వాహనాల వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆపై ఆర్టీసీ బస్సుల్లోనే అనుమతులు ఇవ్వనున్నారు.