Sankranthiki Vasthunnam Bulli Raju Biography : ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు, దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్‌సాయి సుభాష్ (బులిరాజు). ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బాల నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఎవరినోట విన్నా రేవంత్ పేరు వినిపిస్తోంది. ఇతను గత సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశాడు.
ప్రచార వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. అది వైరల్ కావడంతో దిల్‌రాజు, అనిల్ రావిపూడి చూశారు. నిర్మాత దిల్‌రాజు కార్యాలయంలో రేవంత్‌ను ఆడిషన్స్ చేశారని తన తండ్రి తెలిపారు. అక్కడ తన కుమారుడిని ఎంపిక చేశారని బులిరాజు తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. ఏదో సినిమా చేస్తున్నాడని అనుకున్నాంగానీ ఇంత పేరు వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా గుర్తు పట్టి నువ్వు బులిరాజువు కదా అని అడుగుతున్నారని, కొందరు ఫొటోలు దిగుతున్నారని ఆయన తెలిపారు.
'సంక్రాంతికి వస్తున్నాం' - 'ఓ సామాన్యుడి స్టోరీ' చదివేయండి!
మూడు నెలల సెలవు:రేవంత్ నిడమర్రు మండలం బావాయిపాలెం చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సినిమా చిత్రీకరణ కోసం పాఠశాలకు మూడు నెలలు సెలవు పెట్టాడు. కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్‌లలో పాల్గొన్నాడు. రేవంత్ సినిమా చేస్తున్న విషయం ఉపాధ్యాయులకు తప్ప మిగతా వారికి తెలియదు.
నాడు ఎమ్మెస్ నేడు రేవంత్ :ఆనాడునిడమర్రు గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ హాస్య నటునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చానమిల్లికి చెందిన భీమాల రేవంత్ బాల నటుడిగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఆ ప్రాంతాలవారు ఎంతో సంతోషిస్తున్నారు.
వైద్యుడు కావడమే ధ్యేయం :రేవంత్ బాగా చదివి వైద్యుడు కావాలనుకుంటున్నాడని ఆయన తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. వైద్యుడైతే పేదలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తన ఆలోచన అని తెలిపారు. సినిమా విజయవంతం కావడంతో చానమిల్లి గ్రామస్థులు ఎంతగానో సంతోషిస్తున్నారన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న వెంకీ - బాబాయ్ హోటల్లో 'సైంధవ్' యూనిట్ సందడి