Sand Transport by Tractors Allowed :రీచ్‌ల నుంచి సొంత అవసరాలకు ఇసుకను ఉచితంగానే ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. స్థానికంగా అవసరాలకు ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లతోనూ ఇసుకను తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.
గతంలో సొంత అవసరాలకు రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్ల బండ్లను మాత్రమే అనుమతించామని, ప్రస్తుతం సదరు ఉత్తర్వును సవరిస్తున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నిబంధనను ట్రాక్టర్లకూ పొడిగిస్తూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక అవసరాల నిమిత్తమే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ జారీ చేశారు. ఈ మేరకు తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా గనుల శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
అదే విధంగా ఉచిత ఇసుకకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ఇసుకపై సీనరేజ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని సీఎం తెలిపారు. ఉచిత ఇసుకపై టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో ఈ మేరకు సీఎం కీలక ప్రకటన చేశారు.