Rythu Bheema and Rythu Bandhu Scam : తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ ఘటన మరువక ముందే మరో కుంభకోణం బయటకు వచ్చింది. రైతుబంధు, రైతు బీమా పేరిట వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపి రూ.2 కోట్లు కాజేశారు. అన్నదాతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరణించిన రైతులకు రైతు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10,000ల చొప్పున సాయం చేసింది.
Rythu Bheema Scam in Telangana : ఆ పథకంలో లొసుగులను అవకాశంగా మార్చుకున్న రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలానికి చెందిన వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు కుంభకోణానికి తెరలేపారు. ఆ ప్రాంత పరిధిలో కొందరు అన్నదాతల వివరాలు సేకరించిన అధికారులు వారు మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి మేర పరిహారం నిధులు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు అధికారుల అరెస్ట్
ఎల్‌ఐసీ ఫిర్యాదులో వెలుగులోకి : 20 మంది బతికున్న అన్నదాతలను చంపేసి, 2020 నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రైతు బీమా (Rythu Bheema) కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. ఆ క్లెయిమ్‌ల చెల్లింపులకు సంబంధించి ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ.కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబయిలోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.