Rythu Bharosa Scheme In Telangana: రైతు భరోసా పధకం నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం రేపటి నుంచి వారి ఖాతాల్లో నేరుగా జమ కానుంది. ఆదివారం గణతంత్ర వేడుకల సందర్బంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభిస్తారు.
కొత్తవారికి అవకాశం : కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మందికి రైతుబంధు నిలిచిపోయేది. ఇప్పుడా సమస్యల్ని సరిచేసుకొని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ చిట్టా రెండు మూడు రోజుల్లో సిద్ధం : ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూములను గుర్తించారు. ఆ విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తీసివేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తహసీల్దార్లు, సీసీఎల్ఏకు చెందిన జాబితాల్లోనూ ఈ వివరాలు పొందుపరుస్తున్నారు.