జగన్ జట్టులో కీలక మంత్రి - ఆయనకు బేరాలు ఉండవు 5 శాతం ఫిక్స్! Ruling Party Minister Scams in Government Schemes:జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉత్తరాంధ్ర మంత్రి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఉంటామో ఊడతామేమోననే భయంతో కోట్ల రూపాయల విలువైన పనుల్ని అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు. పిల్లలకన్నా మంత్రిగారికి బాగా కలిసొచ్చిన పథకం విద్యాకానుక. అందులోనే 5శాతం కమీషన్ విధానానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. మూడోవిడత విద్యాకానుకలో నాణ్యతలేని బ్యాగులు సరఫరా చేశారు. పంపిణీ చేసిన రెణ్నళ్లకే చాలా వరకూ చినిగిపోయాయి. నిబంధనల ప్రకారం గుత్తేదారు అవన్నీ మార్చాల్సి ఉన్నా కేవలం ఆరు లక్షలే కొత్తవి ఇచ్చి సరిపెట్టేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం:విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇది బయటపడినా కీలక మంత్రి కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం వహించింది. ఇక గతేడాది ఇచ్చిన విద్యా కానుకలోనూ 5శాతం కమీషన్ విధానమే కొనసాగించారనే విమర్శలున్నాయి. ఐతే కమీషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికిపైగా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు షరతు పెట్టారట. మంత్రిగారు ఇటీవలే 500 కోట్ల రూపాయల మేర సమగ్ర శిక్షా అభియాన్ నిధులు విడుదల చేయించి గుత్తేదార్లకు 50 శాతానికి పైగా బిల్లులు చెల్లించేలా చూశారట. ఆ తర్వాత ఆయన వాటా ఆయన సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.
మంత్రికి సహకరించినందుకు సమగ్రశిక్షా అభియాన్‌లోని ఇద్దరు కీలక అధికారులకూ వాటా ముట్టిందనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ చేయాల్సిన విద్యాకానుక కిట్ల కాంట్రాక్ట్‌నూ టెండర్లు లేకుండానే కట్టబెట్టడం దుమారంరేపింది. దస్త్రాన్ని 4 నెలలపాటు తొక్కిపెట్టి సరిగ్గా ఎన్నికల ముందు టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే 772 కోట్ల విలువైన పని కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం న్యాయసమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించి, టెండరు విలువ తగ్గిపోయేలా చేశారు.
పోలీసులపైనా వైసీపీ మూకల దాష్టీకాలు- ఐదేళ్లుగా దాడులు, దౌర్జన్యాలతో బెంబేలు - YSRCP Attacks on Police Employees
పాఠ్యపుస్తకాల్లో అవినీతి:పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్‌లో విక్రయించే వాటినీ ఆ మంత్రి వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి స్కెచ్ వేశారు. ముద్రణా సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు. ప్రైవేటు బడుల కోసం మార్కెట్‌లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం ఒక పేజీకి 44 పైసలుగా నిర్ణయించి, 16 సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది. ఐతే మూడు సంస్థలే బినామీ పేర్లతో ముద్రణ బాధ్యతల్ని రెండేళ్ల కాలానికి దక్కించుకున్నాయి. ఈ ప్రక్రియలో సీఎంఓలోని ఓ సలహాదారు, మంత్రి భారీగా లబ్ధి పొందారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్‌ల టెండర్లనూ పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి గట్టిగా ప్రయత్నించారు. గతేడాది డిసెంబరులో పంపిణీ చేసిన ట్యాబ్‌లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఉద్దేశించిన దస్త్రాన్ని రెండు నెలలు తొక్కిపెట్టారు. పాత గుత్తేదారుకే అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందు 750 కోట్ల రూపాయల టెండర్‌ను పాతవారికి ఇవ్వొద్దని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో కొత్తగా టెండర్లు పిలిచారు. ఐనా పాత గుత్తేదారుకే టెండర్ దక్కడం, సరఫరా చేసిన నెల రోజుల్లో బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు నుంచి తీసుకునేలా గ్యారంటీ ఇప్పించడం మంత్రిగారి మహిమేనంటారు.
వేల సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు - వైసీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారి కుట్ర - Fake Votes Registration
చిక్కీలు, కోడిగుడ్లు పేరిట మేత: ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి మూడు రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు. ఇతర పథకాలకు చిక్కీ కిలో 135 రూపాయలకే ఇస్తుంటే, పాఠశాలల్లో సరఫరాకు కిలో 149 రూపాయల చొప్పున చెల్లించారు. మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టులోనూ దోచుకున్నారు. 2023 ఆగస్టుతో ముగిసిన కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ గడువును 2024 జులై వరకూ పొడిగించారు. నెక్ ధరతోపాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా గతేడాది టెండర్లు నిర్వహించారు. సరాసరిన కిలోమీటరుకు 40 నుంచి 50 పైసల వరకూ ఇస్తున్నారు. అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు. ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ధి పొందారు.
ఉపాధ్యాయ బదిలీల్లో 50 కోట్లు: ఇక ఉపాధ్యాయ బదిలీల్లో మంత్రిగారి ఇంట పచ్చనోట్ల జాతర జరిగిందనే ప్రచారం ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులకు పైరవీ బదిలీలు నిర్వహించారు. కౌన్సెలింగ్ బదిలీలు ముగిశాక డిప్యుటేషన్లు, బదిలీలు చేయాలంటే గతంలో దస్త్రాలను సీఎం కార్యాలయానికి పంపించేవారు. ఉత్తరాంధ్ర మంత్రి, ఓ ముఖ్య అధికారి ఈ నిబంధనకు పాతరేశారు. ముఖ్య అధికారి, మంత్రి పేషీలోని ఓ పీఏ కలిసి 2 వేల 600 మంది ఉపాధ్యాయలకు సిఫార్సు బదిలీలను ప్రతిపాదించారు. ఒక్కో బదిలీకి 3 నుంచి 4 లక్షలు వసూలు చేసుకుని దాదాపు 50 కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్‌కు ఒక్కరోజు ముందు ఇంటర్ బోర్డులో 190 మందికి పదోన్నతులు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి 50 వేల చొప్పున వసూలు చేశారని, ఈ తతంగమంతా మంత్రి ఇంటి కేంద్రంగా జరిగిందనే ఆరోపణలున్నాయి.
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫేక్ వీడియోలు- హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు - Fake Video in The Name of ETV
విశ్వవిద్యాలయాలకు అనుమతుల రూపంలో:ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడంలోనూ ఈ మంత్రి బాగానే పిండుకున్నారు. ఇటీవల 3 ఇంజినీరింగ్ కళాశాలలకు వర్సిటీలుగా అనుమతి ఇచ్చారు. ఇందులో ఓ కళాశాల యజమాని మంత్రికి భారీగా సమర్పించుకున్నారట. డబ్బులిచ్చాక తొందరగా పనికాకపోవడంతో కళాశాల యజమాని కుమారుడు మంత్రి పేషీ చుట్టూ కొంతకాలం తిరిగి ప్రైవేటు వర్సిటీ సాధించుకున్నారు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాల్లోనూ ఈ ఉత్తరాంధ్ర మంత్రి చక్రం తిప్పారు. ఆయన సతీమణి పీహెజ్డీ చేసేందుకు గైడ్లుగా వ్యవహరించిన ఇద్దరికి ఉపకులపతుల పోస్టులు ఇప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడంతో సీఎం కార్యాలయం సైతం ఆయన పైరవీలకు తలూపింది. ఇదే అదునుగా చెలరేగిన అమాత్యుడు మరో రెండు ఉపకులపతుల పోస్టులనూ తన కోటాలోనే ఇప్పించారు.