RTC Destroyed By YCP Government :జగన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ఎంత నిర్వీర్యం చేయాలో అంతా చేశారు. విలీనం పేరిట ఆర్టీసీ బస్సుల కొనుగోలు ఆపేశారు. ప్రైవేటు పరంను వేగవంతం చేశారు. వైసీపీ నేతలకు ఆర్టీసీకి చెందిన వేల కోట్ల ఆస్తులు లీజుకు అప్పగించారు. కొత్త బస్సుల కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు డొక్కు బస్సులే గతయ్యాయి. ఆ బస్సుల చక్రాలు ఊడటం, ప్రమాదాల బారిన పడుతుండటం ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోడం ఇలా ఈ ఐదేళ్లలో ఆర్డీసీకి ఎంత చేయాలో అంతా చేశారు.
ఆర్టీసీ ఆస్సులు ప్రైవేటు పరం :వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక APSRTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆంజనేయ రెడ్డి కమిటీతో అధ్యయనం జరిపించి ఆ నివేదిక ఆధారంగా RTCని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనాన్ని ఓ అద్భుతంగా ఆనాడు అధికార పార్టీ నేతలు తెగ అభివర్ణించారు. రవాణా రంగం రూపు రేఖలే మారతాయన్నారు. ప్రజలకు భారీగా కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. సీన్ కట్ చేస్తే చెప్పింది ఒకటి జరుగుతోంది మరొకటి అన్నట్టు ఉంది. విలీనం అనంతరం ప్రైవేటీకరణ వేగవంతమయ్యింది. విలీనం నాటికి RTC అప్పు కేవలం 6 వేల 700 కోట్లు. కానీ, ఆర్టీసీకి ఉన్న ఆస్తుల విలువ 50 వేల కోట్ల పై మాటే. అయితే, ఇక్కడే వైసీపీ ప్రభుత్వం ఆసలైన ఆట మెుదలుపెట్టింది. డీజిల్ రేట్లకు అనుగుణంగా టికెట్ రేట్లుపెంచకపోవడం, MV టాక్స్‌లు, స్పేర్ పార్ట్స్ ధరల పెంపు తదితర కారణాలతో వచ్చిన నష్టాలను బూచిగా చూపి ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు రెడ్ కార్పెట్ పరిచింది.
ఆర్టీసీలో కాంట్రాక్టులన్ని వైసీపీ నేతల చేతుల్లో:విలీనం అనంతరం సిటీ సెంటర్లలో ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తున్నారు. ఆర్టీసీ సొంతంగా అభివృద్ధి చేసి అద్దెకిచ్చే అవకాశం ఉన్నా వైసీపీ సర్కారు ఆ పని చేయలేదు. ఇప్పటికే ఈ తరహాలో నాలుగు డీజిల్ బంకులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లలోని ముఖ్యమైన స్థలాలు, హోటళ్లు, డార్మెటరీలు అన్నీ వైసీపీనేతల పరమయ్యాయి. పలు జిల్లాల్లోఖాళీ స్థలాలన్నీ వైసీపీనేతలు లీజు పద్ధతి ద్వారా తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నారు. పలు చోట్ల వైసీపీ కేంద్ర కార్యాలయాల నిర్మాణాలకు సైతం కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను తీసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీలో అద్దెబస్సులు పెట్టే కాంట్రాక్టులు సైతం వైసీపీ నేతల చేతుల్లోనే నడుస్తోంది.
ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య :విలీనం అనంతరం ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. ఉన్న బస్సులను తగ్గించేసి ప్రయాణికులకు నరక యాతన పడేలా చేశారు. 2019లో వైసీపీ సర్కారుకు అధికారంలోకి వచ్చి స్టీరింగ్ చేపట్టింది మొదలు ఆర్టీసీ పతనం ప్రారంభమైంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2019 మార్చి నాటికి సంస్థలో 12027 బస్సులు తిరుగుతుండగా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏకంగా 1324 బస్సులను తగ్గించింది. దీంతో ప్రస్తుతం తిరుగుతోన్న బస్సుల సంఖ్య 10703కి పడిపోయింది. 2019లో సంస్థ సొంత బస్సులు 9459 ఉండగా ఐదేళ్లలో 520 బస్సులను తగ్గించగా ప్రస్తుతం అవి 8106కి పడిపోయింది. 2019 లో అద్దె బస్సులు 2568 ఉండగా ఐదేళ్లలో వారికి రెడ్ కార్పేట్ వేశారు. దీంతో ఐదేళ్లలో అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో తిరిగే ఆర్టీసీ సొంత బస్సులు 79 శాతం కాగా అద్దె బస్సుల శాతం 21 శాతం మాత్రమే. దీన్ని బట్టి చూస్తే సంస్థను ప్రభుత్వం ప్రైవేటీకరణవైపు ఎలా నడిపించిందో అర్థమవుతుంది. 2022 బడ్జెట్ లో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం 408 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టినా ఒక్క బస్సునూ కొనలేదు. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న 8895 బస్సుల్లో 2400 బస్సులు కాలం చెల్లినవే ఉన్నాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు రావాల్సి ఉండగా కొనుగోలు చేయలేదు.
ప్రయాణికులపై ఏటా 1200 కోట్ల రూపాయల భారం : విలీనం చేసి సదుపాయాలు పెంచుతామన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మూడు సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచారు. దీంతో ప్రయాణ చార్జీలు మూడింతలు అయ్యాయి. గతంలో టికెట్ లెక్కన సెస్ వసూలు చేస్తుండగా ఇప్పుడు ప్రయాణించిన దూరానికి కిలోమీటర్ల ప్రకారం లెక్క చూసి సెస్‌ను బాదేశారు. దీంతో ఏటా 1200 కోట్ల రూపాయల భారాన్ని ప్రయాణికులపై మోపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కనీసం సదుపాయాలైనా కల్పించిందా అంటే అదీ లేదు. రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో అధ్వాన్నంగా తయారయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతోన్న 2400 డొక్కు బస్సులు ఎప్పుడు , ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నాయి. కొన్నిచోట్ల బస్సు టైర్లు ఊడి ప్రమాదాలు జరిగిన ఘటనలను మనం చూస్తున్నాం. అటు కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వకపోవడంతో ఆర్టీసీ ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 3669 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బస్సుల సంఖ్య తగ్గించి పలు గ్రామాలకు బస్సులను నిలిపి వేసింది. ఫలితంగా ఇప్పుడు ఆర్టీసీబస్సులు తిరగని గ్రామాల సంఖ్య 5 వేలకు పెరిగింది.