Funds For Telangana Singareni in Union Budget 2024 :కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణలోని సింగరేణి గనుల సంస్థకు రూ. 1600 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపుల్లో రూ. 50 కోట్లు తగ్గాయి. హైదరాబాద్‌లోని ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్‌కు రూ.352.81 కోట్లు కేటాయించారు. దీంతో గతం కంటే ఇది రూ.12 కోట్లు అధికం. దేశంలో అణు ఇంధన కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఖనిజాన్వేషణ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. హైదరాబాద్ ఐఐటీకి రూ.122 కోట్లే కేటాయించారు. ప్రతి సంవత్సరం విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల కింద ఈ సంస్థకు నిధులు కేటాయిస్తూ వస్తున్నారు.
హైదరాబాద్ ఐఐటీకి రూ.122 కోట్లే : గత ఏడాది బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించినా, అంచనాల సవరణ నాటికి రూ.522 కోట్లకు పెంచారు. దీంతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ.400 కోట్లు తగ్గాయి. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థకు రూ.10.84 కోట్ల నిధులు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.80 కోట్లు తక్కువ. ఇన్‌కాయిస్‌కు రూ.28 కోట్లు ఇచ్చారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.కోటి అధికం. తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. వాటి కేటాయింపులను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్లలో విలీనం చేశారు. ఇకపై సెంట్రల్ యూనివర్సిటీల గ్రాంట్ల ద్వారానే గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయిస్తారు.