RS.10 crore Loan Fraud in Nagarkurnool :నాగర్ కర్నూల్ జిల్లా పూర్వ అమ్రాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన సుమారు రూ.10కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు నాలుగైదేళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటి బయటత పడుతోంది. బ్యాంకు అధికారులు లోతైన విచారణ జరపగా 1827 ఖాతాలకు సంబంధించి సుమారు రూ.10 కోట్ల మేర అక్రమంగా రుణాలు మంజూరైనట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ ప్రస్తుతం అమ్రాబాద్, పదర మండలాల్లోని వివిధ గ్రామాల్లో విచారణ జరుపుతోంది.
మరణించిన వారిపై లోన్ మంజూరు చేసి :అప్పటి పీఏసీఎస్ ఛైర్మన్, బ్యాంకు మేనేజరు కుమ్మక్కై తమ పేరిట రుణాలు మంజూరు చేసి ఆ డబ్బుల్ని నొక్కేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకోసం అప్పట్లో ప్రతి గ్రామంలో వారు తమ ఏజెంట్లను నియమించుకున్నారని రుణాలు ఇప్పిస్తామని ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ సహా ఇతర దస్త్రాలను సేకరించారని చెబుతున్నారు. భూమిలేని వారి పేరుమీదా, మరణించిన రైతుల పేరుమీద రుణాలు మంజూరు చేసి అందిన కాడికి దండుకున్నారు.
చనిపోయిన రైతుల పేరుమీద రుణాల మంజూరు - కామారెడ్డిలో బ్యాంకర్ల అక్రమాలు
ఈ క్రమంలోనే నకిలీ దస్త్రాల సృష్టి, ఫోర్జరీ సంతకాలు, బ్యాంకును మోసం చేసి రుణాల మంజూరు, ఇతరుల పేరుమీద డబ్బుల స్వాహా లాంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తీసుకోని రుణాన్ని వడ్డీతో సహా చెల్లించమంటే రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితిలో ఉన్న తాము ఆ రుణాలు కట్టలేమని వాపోతున్నారు.