RP Sisodia Interview With Land Irregularities : రాయలసీమ జిల్లాల తర్వాత అత్యధికంగా భూ అక్రమాలు విజయనగరం, విశాఖ జిల్లాల్లోనే జరిగాయని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా పేర్కొన్నారు. ఇక్కడి భూముల విలువ చాలా ఎక్కువగా ఉందన్నారు. రాయలసీమలో కొన్ని చోట్ల ఎకరం విలువ విజయనగరం, విశాఖలో సెంటు భూమితో సమానమన్నారు. దీంతో ఈ భూములపై కొందరు గద్దల్లా వాలిపోయారని ఆర్‌పీ సిసోదియా వివరించారు.
విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన నేపథ్యంలో పలు విషయాలను ఆయన తెలిపారు. పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములనూ దోచుకున్నట్లు అనుమానాలున్నాయన్నారు. ఈ రెండు జిల్లాల్లో వందల ఎకరాలు కొద్దిమందే కొన్నారని ఆయన తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయన్నారు. వీటిపై ఎన్నో సందేహాలున్నాయని, శుక్ర, శనివారాల్లో జరిగే క్షేత్రస్థాయి పరిశీలనల్లో ఏ అక్రమాలు బయటపడతాయో చూడాలని పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో ఏదో తప్పు జరిగింది - ప్రజలకు న్యాయం చేయాలి: సిసోదియా - RP Sisodia Comments on IAS and IPS
ఎసైన్డ్, నిషేధిత జాబితా, చుక్కల భూమి, ఫ్రీ హోల్డ్ భూములు రాష్ట్రంలో భారీగా చేతులు మారాయని ఆర్‌పీ సిసోదియా అన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి, రికార్డులను తారుమారు చేసి భూములు కొల్ల గొట్టినట్లు ఆరోపణలున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు ఒక నమూనా ఇస్తున్నట్లు తెలిపారు. అందులో 2019 ఏప్రిల్ ఒకటికి ముందు, 2024 ఏప్రిల్ 1 నాటికి ఉన్న భూముల వివరాలు ఇవ్వాలని వాటిని విశ్లేషించి అక్రమాలు తేలుస్తామని చెప్పారు.
పేదలు మోసపోయారు:రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌కు గుర్తించగా వాటిలో 25 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని సిసోదియా పేర్కొన్నారు. మూడు నెలల పాటు తదుపరి క్రయవిక్రయాలు నిలిపేశామన్నారు. ఈ లోపు వీటిల్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో తెలుసుకుంటామని వివరించారు. ఎసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టాన్ని వ్యతిరేకించట్లేదని పేదలకు నిజంగా న్యాయం జరిగిందా అనేది తప్పక చూస్తామని తెలిపారు. కొందరు రైతులను మభ్యపెట్టి ఎసైన్డ్ భూములను రూ.5 లక్షలకు కొన్నారని ఆయన ఆరోపించారు. క్రమబద్ధీకరణ జరిగాక ఆ భూముల విలువ రూ.5 కోట్లు అయిందని, అక్రమాలు, తప్పులు జరిగితే గుర్తించి రికార్డులను మారుస్తామన్నారు.
"గత ప్రభుత్వ పారిపాలనలో రాష్ట్రంలో అనేక సంస్థలకు ఉదారంగా తక్కువ ధరకు భూములు కేటాయించారు. భూ వినియోగం, కేటాయింపు నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటివి గతంలో రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి" అని సిసోదియా పేర్కొన్నారు.
ప్రవాహ సమయంలో పని చేయటం కష్టమే - తుంగ'భద్ర'తాంశం మాకో పరీక్ష: కన్నయ్యనాయుడు - Kannaiahnaidu on Tungabhadra Dam