ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లపై కొరవడిన పోలీసుల నిఘా - భయభ్రాంతులకు గురవతున్న సామాన్యులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

rowdy_sheeters_anarchies
rowdy_sheeters_anarchies (ETV Bharat)

Rowdy Sheeters Anarchies in Guntur District:గుంటూరు జిల్లాలో రౌడీషీటర్లు పాత నేరస్థులపై పోలీసుల నిఘా కొరవడింది. ఇదే అదనుగా వారు రెచ్చిపోతున్నారు. తమపై పోలీసుల దృష్టి ఉండడం లేదని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని దందాలు దౌర్జన్యాలకు తెగబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత రెండు రోజుల వ్యవధిలో అరండల్‌పేట, తాడేపల్లి, తెనాలి పోలీసు స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న ఉదంతాలే అందుకు నిదర్శనం.

అకారణంగా కత్తితో దాడి: గుంటూరులో శనివారం రాత్రి అరండల్‌పేట స్టేషన్‌ పరిధిలో ఓ బార్‌లో మద్యం తాగడానికి వెళ్లిన యువకుడిపై అకారణంగా రౌడీషీటర్‌ చింతగుంట్ల ప్రవీణ్‌ కత్తితో దాడి చేశాడు. ఆ ఘటనను చూసిన స్థానికులు, బార్‌ నిర్వాహకులు ప్రాణభయంతో తలో దిక్కుకు ఉరుకులు పరుగులు తీశారు. రౌడీషీటర్‌ ప్రవీణ్‌ మరో స్నేహితుడితో కలిసి ఓ బార్‌కు వెళ్లాడు. వారి కంటే ముందు అదే బార్‌కు ఓ యువకుడు మద్యం తాగడానికి వెళ్లి ఆర్డర్‌ చెబుతున్నారు. మేం ముందుగా వచ్చాం. మా తర్వాత వచ్చి మందు కోసం హడావుడి చేస్తున్నావేంటంటూ అతన్ని దుర్భాషలాడి కత్తి తీసి వేటు వేసి భయభ్రాంతులకు గురిచేశాడు.

అక్కడ ఉన్న కొందరు అడ్డుకోవడంతో ఆ యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. గతంలో సంజీవయ్యనగర్‌లో ఓ వ్యక్తిని హత్య చేసిన వారిలో ప్రవీణ్‌ నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అతను శారదాకాలనీలో నిత్యం హల్‌చల్‌ చేస్తున్నాడని సమాచారం ఉన్నా అతని ఆట కట్టించడంలో అరండల్‌పేట పోలీసులు విఫలమయ్యారు. దీంతో అతని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాలంటీర్ హత్య కేసు - వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ అరెస్ట్?

ఇతర విధుల నిర్వహణతో:రాజధాని జిల్లా కావడంతో ఇక్కడి పోలీసులకు తరచూ ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం, వీఐపీల బందోబస్తు నిర్వహించాల్సి వచ్చేది. దీంతో వారికి తమ స్టేషన్‌ పరిధిలో జరిగే వ్యవహారాలు తెలియకుండా పోతున్నాయి. మరోవైపు వైఎస్సార్​సీపీ పాలనలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వలేదు. ఇటీవలే వారిలో మార్పు తీసుకు రావాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ నేరుగా రౌడీషీటర్లు, వారి కుటుంబాలను పిలిపించుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇలా ఒకవైపు కౌన్సెలింగ్‌ ఇస్తుండగానే మరోవైపు కొందరు రెచ్చిపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.

పోలీసులకు ముడుపులు: హరికృష్ణ అనే మరో రౌడీషీటర్‌ 3రోజుల క్రితం ఎర్రబాలెంకు చెందిన సురేష్‌ అనే యువకుడిని చితకబాదడం సంచలనమైంది. హరికృష్ణ అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఉన్నతాధికారులకు సమాచారమిస్తున్నారనే అక్కసుతో సురేష్‌పై దాడికి తెగబడినట్లు చెప్తున్నారు. రౌడీషీటర్‌ హరికృష్ణ దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాడేపల్లి పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్టు చేశారు. రౌడీషీటర్‌ ఇసుక అక్రమ వ్యాపారం చేస్తుంటే పోలీసులకు తెలియదా లేక అతను చేసే అక్రమ వ్యాపారం నుంచి పోలీసులకు ముడుపులు ముడుతున్నాయా అనేది ఉన్నతాధికారులే నిగ్గు తేల్చాలి. స్టేషన్‌ పోలీసులకు పట్టకపోయినా అక్కడ నుంచి ఎస్పీకి సమాచారం చేర వేయాల్సిన స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్‌కు రౌడీషీటర్‌ వ్యవహారాలు తెలియవంటే నమ్మశక్యం కావడం లేదు.

కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్‌ ఓ వ్యక్తిని హత్య చేయగా అతనిపై రౌడీషీట్‌ ఉంది. అతను కొద్ది రోజుల క్రితం ఓ యువతితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో వారి వాహనానికి మరో వాహనం అడ్డు రావడంతో ఒక్కసారిగా బ్రేకు వేయగా కారులోని యువతి తలకు గాయమైంది. బాధిత యువతి తల్లిదండ్రులకు నవీన్‌ సమాచారమిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు నవీన్​ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా జిల్లాలో రౌడీషీటర్ల ఆగడాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ప్రేమిస్తే ఓకే - కాదంటే హత్యే - ఉసురుతీస్తున్న ఉన్మాదం

"ఇంటర్ విద్యార్థిని కేసు" - నిందితుడికి విధించే శిక్ష వేరొకరికి భయం కలిగించాలన్న సీఎం

ABOUT THE AUTHOR

...view details