Rain Effect in Hill Area in Alluri District :వాయిగుండం ప్రభావంతో కురిసిన వానలకు అల్లూరి జిల్లా అతలాకుతలం అయ్యింది. వాయనాడ్ విలయాన్ని తలపించేలా కొండ ప్రాంతాల్లో రాళ్లు కూలిపోయి, మట్టి కరిగి పొలాల్లో చేరి పంటలన్నీ తుడిచి పెట్టుకుపోయాయని గిరి పుత్రులు ఆందోళన చెందుతున్నారు. కొండ నాలుగైదు చోట్ల కుంగి అరవై అడుగుల వృక్షాలు కూడా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుని ఊళ్ల మీద పడ్డాయి.
బండరాళ్లు సైతం బంతుల్లా మారి ఐదు కిలోమీటర్ల మేర దొర్లుకుంటూ వెళ్లి వందల ఎకరాల మాగాణిని నామ రూపాలు లేకుండా చేశాయి. పచ్చగా కనిపించే పొలాలలో బండరాళ్లు వాగులుగా దర్శనమిస్తుంటే గిరి పుత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బ్రతికున్నాం అంతే, తిండి గింజలు పండించుకునే పంట మొత్తం ప్రకృతి విలయానికి అర్పించి పస్తులుండేలా చేసిందని ఆవేదన చెందుతున్నారు.
రెండు వారాలు అల్లూరి జిల్లాలో కురిసిన వర్షం ధారకొండ పంచాయతీ కమ్మరితోటలో బీభత్సం సృష్టించింది. వాయనాడ్ తరహాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదు. కానీ బండరాళ్లు గిరిజనుల పంటపొలాలను నామరూపాల్లేకుండా చేశాయి. పచ్చని పొలాలు వాగుని తలపిస్తున్నాయని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.