ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకులో డబ్బు డ్రా చేస్తున్నారా? - మీ వెంటే 'కర్ణాటక గ్యాంగ్' - లబోదిబోమంటున్న ఖాతాదారులు - ROBBERY GANG AT BANKS

బ్యాంకుల వద్ద మాటు వేస్తున్న కర్ణాటక గ్యాంగ్ - డ్రా చేసుకుంటున్న వారిపై కన్ను

robbery_gang_at_banks
robbery_gang_at_banks (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 7:52 PM IST

Robbery Gang at Banks :బ్యాంకుల వద్ద మాటు వేస్తూ నగదు అపహరించే ముఠా సంచరిస్తోంది. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటున్న వారిపై అగంతకులు కన్నేసి నగదు చోరీకి పాల్పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని జనగామ జిల్లాలో ఇలాంటి చోరీలు అనేకం చోటు చేసుకోగా ఏపీలోనూ అక్కడక్కడా ఇలాంటి నేరాలు వెలుగు చూస్తున్నాయి. తరచూ జరుగుతున్న చోరీలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై బ్యాంకుల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

కర్ణాటక దొంగల ముఠాగా అనుమానం..
జనగామలో మూడు నెలల క్రితం జరిగిన చోరీ ఘటనలో ఎస్సై మోదుగుల భరత్‌ నేతృత్వంలో క్రైమ్‌ విభాగం పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా నిందితుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద చోరీలు జరగడంతో కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులుగానే అనుమానిస్తూ దర్యాప్తు విస్తృతం చేశారు.

బాపట్ల జిల్లాలో భారీ చోరీ - లారీని అడ్డగించి వ్యాపారి నుంచి రూ.39 లక్షలు అపహరణ

వరుస సంఘటనలు.. ఖాతాదారుల బెంబేలు

  • జనగామలో నాలుగు నెలల క్రితం ఓ బ్యాంకులో నగదు విడుదల చేసుకున్న వ్యక్తిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించారు. బ్యాంకు నుంచి గమనిస్తూ బయటకు వెళ్లే క్రమంలో ద్విచక్రవాహనాలపై వెంబడించారు. ఆయన నగదును కారులో పెట్టి, మధ్యలో ఓ పని మీద వాహనాన్ని నిలిపేయడంతో వారు కారు అద్దాలను పగులగొట్టి రూ.5లక్షలను చోరీ చేశారు.
  • ఓ వ్యక్తి గత నెల 18న ఓ బ్యాంకులో భారీ మొత్తంలో డబ్బు డ్రా చేయగా అగంతకులు వ్యక్తిని బ్యాంకులోనే ఉండి గమనించారు. అనంతరం ద్విచక్రవాహనాలపై అనుసరించి మధ్యలో కారు ఆపిన క్రమంలో అద్దాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు.
  • స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణంలో ఓ వ్యక్తి పంట రుణం, గృహ రుణం రూ.5.10 లక్షలు తీసుకొని వాహనంలో పెట్టుకోగా దుండగులు మాటు వేసి అపహరించారు.
  • జనగామ జిల్లాలోనే మరో వ్యక్తి రూ.60 వేలు డ్రా చేసి బైక్​పై స్వగ్రామానికి బయల్దేరాడు. అంతకు ముందే అతడిని అనుసరించిన దుండగులు మాటలతో మైమర్చి కవర్లో ఉన్న డబ్బును తస్కరించారు.

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..
బ్యాంకుల వద్ద నిఘా వేసే మోసగాళ్లు చాకచక్యంగా మాటలు కలుపుతారు. అలాంటి నగదు కాజేస్తున్న అగంతకుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలు వృద్ధులు, నడి వయస్సులు, అంతగా చదువు రాని వారిని టార్గెట్ చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వృద్ధులు, నడి వయస్సుల వారు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తే తమ వెంట తెలిసిన వ్యక్తులను ఒకరిని తీసుకువెళ్తే క్షేమం. అదే విధంగా నిరక్షరాస్యులైతే నగదు డ్రా చేసిన తరువాత ఏమాత్రం ఏమరుపాటుగా ఉండొద్దు.

కార్లు, ద్విచక్రవాహనాల్లో డబ్బులను పెట్టుకున్నప్పుడు నిర్లక్ష్యం తగదు. బ్యాంకర్లు కూడా లోపల, బయట సీసీ కెమెరాల పరిధిలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు వాహనాల పార్కింగ్‌ వద్ద కూడా పలు జాగ్రత్త చర్యలు, సెక్యూరిటీ గార్డుల సాయం తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకు పరిసరాలతో పాటు గమ్యం చేరే వరకూ మార్గ మధ్యలో బాధ్యతగా వ్యవహరించాలని చెబుతున్నారు.

గతంలో ట్రాన్సుపోర్టు అధికారి ఇప్పుడు దొంగ - ₹40లక్షలు చోరీ 42 గంటల్లోపే!

పది వేలు ఎర వేశారు - సాఫ్ట్​వేర్ సొరను ముంచేశారు - IPO షేర్ల పేరిట భారీ మోసం

ABOUT THE AUTHOR

...view details