Roads Damage in Adilabad :ఆదిలాబాద్ జిల్లాలోని లాండసాంగ్వి రహదారి వాహనాదారులకు చుక్కలు చూపిస్తోంది. మట్టిలో వాహనాలు కురుకుపోయి అవస్థలు పడుతున్నారు. జైనథ్ మండలం భోరజ్ నుంచి బేల మీదుగా 353-బీ జాతీయ రహదారి వెళ్తుంది. మార్గమధ్యలో తర్నం వద్ద ఉన్న వంతెన, గతేడాది ఫిబ్రవరిలో కుంగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్‌లోని సీసీఐ పక్క నుంచి లాండసాంగ్వి, నిరాల మీదుగా జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 15 కిలోమీటర్ల రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు.
వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని 9 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు కేంద్రం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2023 జులైలో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి గుత్తేదారుకు అప్పగించింది. అప్పటి నుంచీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్, బేల మండలాల ప్రజలు ఈ రహదారి గుండానే నిత్యం ఆటోలలో మహరాష్ట్రకు వెళ్తుంటారు.
"రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వర్షాకాలం కావడంతో వాహనాలు మట్టిలో కురుకుపోతున్నాయి. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశాడు. అధికారులు చూసీచూడనట్లుగా వ్వవహరిస్తున్నారు. కేవలం 9 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 2 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రభుత్వం స్పందించి రోడ్డును నిర్మాణాన్ని పూర్తిచేయాలి". - స్థానిక వాహనదారులు