Monthly Consumption Expenditure in Telangana : రాష్ట్రంలో ఏడాది కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం పట్టణాల్లో రూ.820, గ్రామాల్లో రూ.633లకు పెరిగిందని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. దీంతో తలసరి నెలవారీ ఖర్చు పెరిగింది. గ్రామాల్లో రూ.5,435కి, పట్టణాల్లో రూ.8,978కి చేరినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం చూసుకుంటే రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ.6,199గా ఉంది. పట్టణాల్లో తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, గ్రామీణంలో కేరళ తలసరి ఆదాయంలో(రూ.6,611) అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఆదాయ వర్గాల వారీగా చూస్తే తెలంగాణలో గరిష్ఠంగా నెలకు రూ.12,619 ఖర్చు అవుతుంది.
రాష్ట్రంలో సర్వే వివరాలు :
- విద్యపై గ్రామీణ ప్రాంతాల్లో నెలకు తలసరి రూ.183, పట్టణాల్లో రూ.713.89 ఖర్చు చేస్తున్నారు. పట్టణాల్లో చదువుల కోసం తెలంగాణలోనే అత్యధిక వ్యయం అవుతోందని నివేదిక తెలిపింది.
- పట్టణాల్లో అద్దెకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు.
- గ్రామాల్లో వైద్యం కోసం నెలకు రూ.376 ఖర్చు చేయగా, పట్టణాల్లో నెలకు రూ.426 చొప్పున వ్యయం అవుతుందని సర్వే పేర్కొంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే మాత్రం ఈ వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వ్యయం తక్కువగా ఉంది.
- మద్యం, పాన్, పొగాకు తదితర ఉత్పత్తుల కోసం పట్టణాల్లో నెలకు రూ.320 ఖర్చు చేయగా, గ్రామాల్లో నెలకు రూ.396 ఖర్చు చేస్తున్నారు.
- ఆహార ఖర్చులో పానీయాలు, ప్రాసెస్ట్‌ఫుడ్ కోసం గ్రామాల్లో 20.84 శాతం, పట్టణాల్లో 33.63 శాతం ఖర్చు చేస్తున్నారు.