Ringing Rocks in AP: ఈ రాళ్లు రాగాలు పలుకుతాయి.. సప్తస్వరాలకు మించి ఎంతో అరుదైన ద్వాదశ స్వర స్థానాలను పలుకుతున్నాయి. ఇక్కడున్న ఒక్కో రాయి ఒక్కో స్వరాన్ని పలికిస్తూ.. మనసును ఎంతో ఉల్లాసంగా ఉత్తేజభరితం చేస్తోంది. సంగీతానికి రాళ్లు కరుగుతాయన్న సామెత విన్నాం. రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు కానీ ఇక్కడి రాళ్లు మాత్రం సరిగమపదని ధ్వనులతో అందరినీ ఆశ్చర్యంలోని నెడుతున్నాయి. రాళ్లు రాగాలు పలకడం ఏంటీ? జీవం లేని రాళ్లు సప్తస్వరాలు పలకడమా.. వింటుంటే విచిత్రంగా ఉన్న ఇది మాత్రం నిజం! అయితే ఈ స్వరాలు పలికే రాళ్లు ఎక్కడ ఉన్నాయి.. ఇంకా వాటి విశేషాలు ఏంటీ అనేది తెలుసుకుందామా?
స్వరాలు పలికే రాళ్ల ప్రదర్శన : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చౌడవరం చేతనలోని సృజన సంగీత పాఠశాలలో స్వరాలు పలికే రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. స్థానిక సంగీత పాఠశాల ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు వీటిని సేకరించారు. తన స్వగ్రామం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు సమీపంలోని బొగ్గుల కొండపైకి స్నేహితులతో కలిసి కోటేశ్వరరావు ఓసారి వెళ్లారు.