CMR Grain Smuggling in Mahabubnagar :ప్రభుత్వం నుంచి పొందిన సీఎంఆర్ ధాన్యాన్ని గుట్టల మధ్య దాచి దర్జాగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఓ మిల్లు యజమాని పట్టుబడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి శివారులో చోటుచేసుకుంది. కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి శివారులోని ఇషాన్ ట్రేడర్స్ బియ్యం మిల్లుకు 2022-2023 సంవత్సరానికి సంబంధించిన వానాకాలం, యాసంగి సీజన్లకు 4.72 లక్షల బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి కేటాయించారు. మిల్లు యాజమాన్యం పేరుకే కొంత ధాన్యం మర ఆడించి ప్రభుత్వానికి పంపించింది. అయితే మిల్లు వద్ద 2,52,162 బస్తాలు ఉండాల్సింది ఉండగా, కేవలం 18,375 ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నాయి.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ :ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన తర్వాత ఆ ధాన్యాన్ని మిల్లు వద్ద లేదా గోదాముల్లో మాత్రమే భద్రపరుచుకోవాలి. ఇషాన్ ట్రేడర్స్ యజమాని మాత్రం అడవిలో గుట్టలో మధ్యలో నిల్వ చేసి, వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచారు. రూ.కోట్ల విలువ గల సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లుకు కేటాయించిన తర్వాత అధికారులు ఎప్పుడూ పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టల మధ్య దాచిన ధాన్యాన్ని వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంలో ఈ నెల 20న అదనపు రెవెన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథంతో కలిసి పరిశీలించారు. ఈ విషయంపై పూర్తి వివరాలను సేకరించాలని కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆదేశించారు.
రూ.11.50 లక్షల 'రైతు బీమా' డబ్బులు స్వాహా - అమాయకపు రైతులను మోసం చేసిన ఏఈవో