ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాళాఖాతం ఉగ్రరూపం! - ఈ నైరుతిలో ఎనిమిది అల్పపీడనాలు - Review on Rains and Ocean Situation - REVIEW ON RAINS AND OCEAN SITUATION

Review on Rains and Ocean Situation: జూన్‌ 28, జులై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబరు 5, 13, 23. ఏంటీ ఈ తేదీలు అనుకుంటున్నారా? బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడిన రోజులు! రుతు పవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా, వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంట వెంటనే ఏర్పడటం, తీవ్ర రూపం దాల్చి, తుపాన్లుగా మారడం, కుంభవృష్టి కురిపించడాన్ని 'అసాధారణం'గా విశ్లేషిస్తున్నారు.

Review on Rains and Ocean Situation
Review on Rains and Ocean Situation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 11:09 AM IST

Review on Rains and Ocean Situation :జూన్‌ 28, జులై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబరు 5, 13, 23. ఏంటీ ఈ తేదీలు అనుకుంటున్నారా? బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడిన రోజులు! కొన్ని సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే, ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికే ఎనిమిది సార్లు అల్పపీడనాలు తూర్పుతీరాన్ని భయపెట్టించాయి.

వాతావరణ మార్పులు, భూతాపం వల్ల మహాసముద్రాలు వేడెక్కుతున్నాయని, వర్షపాతంలో అసాధారణ పరిస్థితులు సంభవిస్తున్నాయనడానికి సాక్షీభూతమే. ఈ సంవత్సరం నైరుతి సీజన్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు. రుతు పవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా, వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంట వెంటనే ఏర్పడటం, తీవ్ర రూపం దాల్చి, తుపాన్లుగా మారడం, కుంభవృష్టి కురిపించడాన్ని 'అసాధారణం'గా విశ్లేషిస్తున్నారు.

లానినో ప్రభావం :బంగాళాఖాతంలో అల్ప పీడనాల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతోంది. తదుపరి భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంతంలోనే కాదు, మధ్య, ఉత్తర భారతం వరకూ అధిక శాతం జనాభా ప్రభావితమవుతోంది. ఏపీలోని విజయవాడ, తెలంగాణాలోని ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవలి కుంభవృష్టికి కూడా ఇక్కడి పరిస్థితులే కారణం. సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువే. ఈసారి వాటికి లానినో ప్రభావం తోడైంది.

పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడుతున్న తుపాన్లు తూర్పు, ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్‌ మీదుగా పయనించి బలహీన పడుతున్నాయి. బంగాళాఖాతంలో మళ్లీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటికే 8 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో 5 వాయుగుండాలుగా బలపడి, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

బంగాళాఖాతంలో వాయుగుండాలు : భూతాపం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు (ఎస్‌ఎస్‌టీ) పెరిగి, తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అవి తీరానికి చేరువగా వచ్చేసరికి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వారానికో అల్పపీడనం రావడంతో నేలలో తేమ శాతం పెరుగుతోంది. ఈ కారణంగా అల్పపీడనం సముద్ర తీరం దాటి, భూభాగంపైకి వచ్చినా బలహీన పడట్లేదు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణంగానే దేశ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలైన గుజరాత్, రాజస్థాన్‌ వరకూ పయనించాయి. ఒడిశా, ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో భారీవర్షాలకు కారణమయ్యాయి.

అల్పపీడనం ప్రభావం ఎఫెక్ట్ - రాష్ట్రంలో జోరందకున్న వర్షాలు - AP Rains Updates

శాస్త్రవేత్తల హెచ్చరికలు :గత పది సంవత్సరాల్లో తుపాన్లుగా బలపడుతున్న అల్పపీడనాల సంఖ్య తగ్గింది. వాయుగుండంగానే ఆగిపోయినా, వాటి తీవ్రత పెరిగినట్లు వాతావరణ సూచికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో అండమాన్‌ దీవుల వద్ద తుపాన్లు ఏర్పడితే, పశ్చిమ దిశగా నెల్లూరు, వాయవ్యంగా కోల్‌కతా వైపు పయనించేవి. కొన్నాళ్లుగా వాటి గమనం మారుతోంది. తీరాలు కోతకు గురికావడంతో తుపాన్‌ తీరాన్ని తాకే ప్రాంతాలు మారిపోతున్నాయి.

తీరం వైపు వెళ్తున్నట్లే కనిపించిన తుపాన్లు, సముద్రంలోనే దిశ మార్చుకుంటున్నాయి. లేదా అకస్మాత్తుగా తీవ్రమవుతున్నాయి. భూతాపం, తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుపాన్ల ఉద్ధృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్‌-జులై, అక్టోబరు-నవంబరు సీజన్లలోనూ తుపాన్లు ఎక్కువగా ఏర్పడవచ్చని, ముఖ్యంగా వర్షాకాల ఆరంభం జూన్, జులై నెలల్లోనే పెను ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వర్షాలకు అవకాశం :పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన తుపాన్ల ప్రభావంతో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం తీరం దాటగానే మరోటి ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్‌ జనరల్ డా.కేజే రమేశ్ తెలిపారు. 'సాధారణం కంటే ఎక్కువ (ఎబోవ్‌ నార్మల్‌)' పరిస్థితులు ఉన్నప్పుడు గతంలోనూ ఇలాగే వానలు పడేవని గుర్తు చేశారు. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి, ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయని అన్నారు. ఈసారి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యం కావడంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలకు అవకాశముందని తెలిపారు.

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు :వాతావరణ మార్పుల కారణంగా తుపాన్ల గమనం అంచనా కష్టమవుతోంది. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన యాగి తుపాను మయన్మార్‌ వద్ద బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురిశాయి. ఇది అంచనాలకు అందనిది. ప్రస్తుతం పసిఫిక్, హిందూ, అట్లాంటిక్‌ మహాసముద్రాల్లోని పరిస్థితులను జపాన్, భారత్, అమెరికాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ దేశాలు కలసికట్టుగా వీటిపై పరిశోధనలు చేయాలి. అంతర్జాతీయ సహకారంతో, పరస్పరం సమాచారం పంచుకోవడంతో, ఆధునిక పరిశోధనలతో వాతావరణ అంచనాలు కచ్చితంగా రూపొందించేందుకు అవకాశముంటుంది. - డాక్టర్‌ తల్లాప్రగడ విజయ్, సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్త, అమెరికా

హైదరాబాద్​లో జోరు వర్షం - రోడ్లన్నీ జలమయం - Hyderabad Rains Today

ABOUT THE AUTHOR

...view details