Demolition Drive in Mahabubnagar : మహబూబ్‌నగర్‌లోని సర్వే నెంబర్ 523లో సర్కారు భూముల ఆక్రమణలపై ఎట్టకేలకు ప్రభుత్వాధికారులు కొరడా ఝళిపించారు. సర్వే నెంబర్ 523లో 83 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. అందులో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు భూములు పంచగా 3 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ భూమి ఆక్రమణలకు గురవుతోందని చాలా కాలంగా ఆరోపణలున్నాయి.
70కి పైగా తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేత :ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని, దళారులు సర్కారు భూములమ్మి సొమ్ము చేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారుల బృందం వచ్చి అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారు. పట్టాలేకుండా, ఉద్దేశపూర్వంగా ఏర్పాటు చేసుకున్న సుమారు 70కిపైగా తాత్కాలిక నిర్మాణాలను నేలమట్టం చేశామని మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ ఘన్సీరాం తెలిపారు.
"కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసుకోమని డబ్బులు తీసుకొని అమ్మడం లాంటివి చేశారని మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆ వ్యవహారంలో ఎవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు వస్తే అర్హత అనుగుణంగా ప్రజలకు అధికారులమే తెలియజేస్తాం. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని కోరుతున్నాం"- ఘన్సీరాం , మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్