Minister Ponguleti On Rythu Runa Mafi : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి తమ ప్రభుత్వం రుణమాఫీపై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం రెండు లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్ణయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వం నిర్వాకంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించకపోయినా, తమ ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుని నిబద్దతను చాటుకుందని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీకి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల ముందే శ్రీకారం చుట్టారని కొనియాడారు. రైతు దేశానికి వెన్నెముకని, ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలన్న దృఢ సంకల్పంతో రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఆర్థిక సహకారం అందజేసి రైతులను రుణ విముక్తులను చేయడం విప్లవాత్మక నిర్ణయంగా మంత్రి అభివర్ణించారు.
రేపే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బు - ఈ పథకానికి అర్హులు ఎవరు? - Pratidhwani ON RYTHU RUNA MAFI
జులై 18వ తేదీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామన్న మంత్రి అదే రోజు సాయంత్రం వరకు రైతు రుణ ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. 16 సంవత్సరాల కిందట కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి రూ.72వేల కోట్లు వ్యవసాయ రుణాలు, వడ్డీని మాఫీ చేసిందని పొంగులేటి గుర్తు చేశారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడేందుకు ఎల్లవేళలా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాదు, పండుగ అనే విధంగా పరిస్థితులను మారుస్తున్నామని పొంగులేటి తెలిపారు. 60శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోందని, ఆ వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతును రాజుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న రైతు రుణమాఫీ: ఈ నెల 18న రూ.లక్షలోపు రుణాలను మొత్తం మాఫీ చేయనున్నారు. ఆగస్టు 15లోగా మిగతా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 15నాటికి రుణమాఫీని పూర్తి చేసేలా చర్యులు చేపడుతున్నారు. ఇందుకు మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ఓ అంచనా. 18 తేదీన 11.50 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ అవుతుంది. రెండో దఫా ఆగస్టు 15 నాటికి మరో రూ.లక్ష బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రేపే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బు - ఈ పథకానికి అర్హులు ఎవరు? - Pratidhwani ON RYTHU RUNA MAFI