Everyone should exercise right to vote:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నెల్లూరు టౌన్‌హాల్‌లో సిటీ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్చా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సామాజిక వేత్తలు, సిటీ ఫర్ డెమోక్రసీ సభ్యులు పాల్గొని వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఉండే శక్తిమంతమైన ఆయుధం ఓటు అని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేర్కొన్నారు. డబ్బు, కులం, మతం ప్రాధాన్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు మంచి చేయాలనే స్పృహ తగ్గిందని విమర్శించారు. ఏపీలో అన్ని వనరులున్నా ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ఆలోచించాలని పిలపునిచ్చారు.
ఇసుక, మట్టి తవ్వకాలతో ప్రకృతి వనరులు దెబ్బతీశారని పీవీ రమేష్ ఆరోపించారు. రాష్ట్రంలో రక్షిత నీరు దొరకట్లేదు, మంచి ఆహారం లేదని దుయ్యబట్టారు. ఏపీ పరిస్థితి చూస్తే ఎడారిలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం అభివృద్ధికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయండని పీవీ రమేష్ పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి, అభివృద్ధి కోసం ఓటు వేయాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ప్రజలపై ఉందని వెల్లడించారు. పోలీసులు ప్రజల్ని భయపెట్టడానికి ఉన్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. మన సార్వభౌమత్వాన్ని రాజకీయ నాయకులకు వదిలేయడం వల్లే ఈ మార్పు అని విమర్శించారు. గతేడాది మద్యం నుంచే రూ.24 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మద్యం ఆదాయం 2019లో రూ. 4 వేల కోట్లు మాత్రమే ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం రానంత కాలం ఎవరి రాజ్యం వారిదని విమర్శలు గుప్పించారు.
పేదలకు డబ్బులు పంచినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదు: పీవీ రమేష్