తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో 40 శాతం యువతలో బీపీ, షుగర్! - వెల్లడించిన పరిశోధన - ఇలా జాగ్రత్తపడండి

- ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న జీవనశైలి - పద్ధతి మారిస్తేనే హెల్దీ లైఫ్

Increase of Diabetes in Youth
Increase of Diabetes in Youth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 8:40 AM IST

Increase of Diabetes in Youth:ప్రస్తుతం జీవనశైలి వ్యాధులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి కారణంగా యువకులు సైతం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలతో బాధపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగర పరిధిలో చేసిన ఓ స్టడీలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి.

నగరంలోని అర్బన్, పెరి అర్బన్, శివార్లలోని గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు దాడి చేస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 40 శాతం మందిలో మధుమేహం నియంత్రణలో లేనట్లు పరిశోధకులు గుర్తించారు. నగరానికి చెందిన హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ (హెచ్‌హెచ్‌ఎఫ్‌) వాలంటీర్లు 10,400 మందిపై పరిశోధన చేపట్టగా.. వీరిలో నగర శివార్లలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 2,649 మంది మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలిందట. ఇక నగరంలో 10 అర్బన్, పెరి అర్బన్‌ ప్రాంతాల్లో పరీక్షలు చేపట్టగా.. 2,570 మందికి ఈ రెండు సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు హెచ్‌హెచ్‌ఎఫ్‌ తెలిపింది.

30-50 వయసు వారిలోనే
అయితే.. గ్రామీణ యువతతో పోల్చితే పట్టణ ప్రాంతంలో సుమారు 50 శాతం మంది ఎక్కువగా అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. మూత్రపిండాలు, మెదడు, హృద్రోగ సమస్యలకు బీపీ, షుగర్ కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

వైద్యం పొందేవారు తక్కువే..
ఇవి దీర్ఘకాలిక వ్యాధులు కావడంతో.. చికిత్సను కంటిన్యూ చేసే వాళ్లు తక్కువగా ఉంటున్నారట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఇవ్వపోవడం వల్ల డబ్బులు పెట్టి బయట కొనలేక కొందరు చికిత్స మధ్యలోనే ఆపేస్తున్నారట. ఫలితంగా కొన్నాళ్లకు ఇవి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని వైద్యులు వెల్లడించారు. మద్యపానం, పొగతాగడం తదితర అలవాట్ల వల్ల మధుమేహం, అధిక రక్తపోటు పెరిగిపోతున్నాయట. వీటిని సకాలంలో బాధితులు గుర్తించకలేకపోతున్నారని.. దాదాపు 40 శాతం మంది షుగర్ రోగుల్లో హెచ్‌బీఏ1సీ 7.5 ఎంజీ/డీఎల్‌గా ఉండటం ఆందోళన కలిగించే అంశమని అధ్యయనం చేసినవారు తెలిపారు. సాధారణంగా ఈ స్థాయిలు 4-6 మధ్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకర జీవనశైలే మార్గం..

ఎప్పుడో 50 - 60 ఏళ్లు దాటిన తర్వాత రావాల్సిన వ్యాధులు 30 ఏళ్ల నుంచే మొదలు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీవనశైలిని గాడిలో పెట్టడం ద్వారానే ఈ పరిస్థితిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవద్దని, తాజా పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలకు ఆహారంలో చోటు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఇవి పాటించడం ద్వారా రోగాలకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నడుము కొవ్వు తగ్గాలా? ఈ యోగాసనాలు చేస్తే ఫలితం ఉంటుందట! - Yoga Asanas for Reducing Hip Fat

షుగర్​ నార్మల్​కి వస్తే మందులు ఆపేయవచ్చా? - నిపుణుల సమాధానం ఇదే! - Diabetes and Medication

ABOUT THE AUTHOR

...view details