Realtor Attempts to Grab Dalit Lands :కర్నూలులో రూ. 200 కోట్ల విలువైన దళితుల భూములపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నేశారు. ముగ్గురు ప్రజాప్రతినిధుల అండతో భూములను లాగేసుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. వెంటనే ఖాళీ చేయాలంటూ దళితులపై బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసుల సాయంతో ఎలాగైనా భూములను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తరాలుగా భూములను తాము సాగు చేసుకుంటున్నామన్న దళితులు వాటిని కాపాడుకునేందుకు ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Dalit Land issues in Kurnool :కర్నూలు శివారులోని మునగాలపాడులో ఉన్న 200 ఎకరాల దళితుల భూములపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నేశారు. ఆయా భూముల విలువ 200 కోట్లకు పైగా ఉండటంతో ఎలాగైనా దక్కించుకోవాలని ముగ్గురు ప్రజాప్రతినిధుల సహకారంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మునగాలపాడులో గత వందేళ్లుగా సుమారు 50 నుంచి 60 మంది దళితులు వారసత్వంగా ఆయా భూముల్ని సాగు చేసుకుంటున్నారు. అందుకు తగిన ఆధారాలు వారి దగ్గర ఉన్నాయి. పలువురికి అధికారులు పట్టాలు కూడా ఇచ్చారు. అయితే రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూములుగా చూపడం వారికి శాపంగా మారింది.
దొరికినంత దోచుకో - పంచుకో - విశాఖలో వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలు
ఆయా భూములకు సమీపంలోనే జాతీయ రహదారి ఉండటం, మరోవైపు చెన్నై - సూరత్ ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మిస్తుండటంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఎకరం కోటికి పైగా పలుకుతోంది. కర్నూలుకు కూతవేటు దూరంలోనే ఉన్నందున వాణిజ్య అవసరాలకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో ఓ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా మారిస్తే కోట్లలో ఆదాయం వస్తుందని ఓ స్థిరాస్తి వ్యాపారి భావించారు. ఆ భూమిని సేకరిస్తే ఫిలిం సిటీ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్వహించుకోవచ్చని ముగ్గురు ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వారు అంగీకరించడంతో దళితులను ఖాళీ చేయించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.