Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ ఫోన్లను ట్యాప్ చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ పలువురు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో రాధాకిషన్ రావుపై ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చి రాధాకిషన్ రావు (radhakishan rao) రూ.కోట్లు తీసుకెళ్లారని ఫిర్యాదులో వెల్లడించారు. దాంతో సంధ్యా శ్రీధర్‌రావును విచారణకు పిలిచిన పోలీసులు, ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు - టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు - TS Phone Tapping Case
మరోవైపు అదనపు ఎస్పీలు భుజంగరావు(bhujangarao), తిరుపన్నల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వారిద్దరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందికి నోటీసులిచ్చేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. తాజాగా ఇద్దరు అదనపు ఎస్పీల వాంగ్మూలం ఆధారంగా, మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలు వెల్లడించిన వివరాలను పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారం ఒక్కటే కాకుండా, టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం కీలకంగా ఉన్న రాధాకిషన్‌రావుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ పార్టీ అభ్యర్థులకు, రాధాకిషన్‌రావు కనుసన్నల్లోనే టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు డబ్బు తరలించినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఆయన్ను కస్డడీకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు రాధాకిషన్‌రావును 10 రోజుల కస్టడీకి అనుమంతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీల కస్టడీ ముగిసేలోపు, రాధాకిషన్‌రావు కస్టడీకి కోర్టు అనుమతిస్తే ముగ్గురిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌తో అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అరెస్టు అయిన పోలీసు అధికారుల నుంచి విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update
ట్యాపింగ్ ప్రకంపనలు - నేతల పరస్పర ఆరోపణలు - telangana phone tapping case