Reading Nook Ideas For Kids :భోజనం చేయడానికి డైనింగ్ హాల్, దేవుడిని ప్రార్థించడానికి పూజగది, విశ్రాంతి తీసుకోవడానికి బెడ్రూం, మొక్కల కోసం బాల్కనీ ఇలా ఇంట్లో ఒక్కోదానికీ విడివిడిగా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటే మరి ఏకాగ్రతగా చదువుకోవడానికి ప్రత్యేకంగా కాస్త చోటు ఉంటే బాగుటుంది కదా. సరిగ్గా మీకూ ఇదే ఆలోచనే వచ్చిందా అయితే ఈ రీడింగ్ నూక్స్ మీద ఒక లుక్కేయండి!
పిల్లలు ఇష్టపడితేనే ఏ పనైనా బాగా చేయగలరనే ఉద్దేశంతో అమ్మానాన్నలు చాలా వరకు వాళ్లకు నచ్చినట్టే ఉండేలా చూసుకుంటారు. అది తినే కంచమైనా, పడుకునే మంచమైనా. మాములుగా వాడుకునే ఈ వస్తువుల్లోనే ఇంత శ్రద్ధ చూపిస్తే చదువు విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు. అందుకు పరిష్కారం చూపిస్తూనే హోంవర్కులు చేసుకోవడానికీ, ఇష్టమైనని చదువుకోవడానికీ వీలుగా రకరకాల స్టడీ టేబుళ్లూ, రీడింగ్ నూక్స్లాంటివెన్నో అందుబాటులోకి వచ్చాయి. తక్కువ స్థలంలోనే ప్రత్యేకంగా కనిపించే ఈ రీడింగ్ నూక్స్లో ఇప్పుడు బోలెడన్నీ వెరైటీలొచ్చి చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
ఏకాగ్రతతో చదువుకోవచ్చు :బుజ్జాయిలకు చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మంచి పుస్తకాలు కొనివ్వడమే కాదు, పిల్లలు ఓ దగ్గర ప్రశాంతంగా కూర్చుని చదువుకునేలా తగిన ఏర్పాట్లూ చేయాలి. ఉన్న చిన్న ఇంట్లోనే ఆ సౌకర్యం కావాలంటే ఈ రీడింగ్ నూక్స్‌ను ట్రై చేయొచ్చు. ఖాళీ సమయాల్లో నచ్చిన పుస్తకాలు చదువు కోవాలన్నా, కాలక్షేపానికి పత్రికలూ, పజిల్ బుక్స్ లాంటివి తిరగేయాలన్నా అందుకు ఇవి సరిగ్గా సరిపోతాయి. ఇంకా పరీక్షలప్పుడూ వీటిల్లో కూర్చుని ఏకాగ్రతతో చదువుకోవచ్చు. ఎన్నెన్నో ఆకారాల్లో ఆకట్టుకునే వీటి లోపల పుస్తకాలు పెట్టుకోవడానికి అరలూ, కూర్చోడానికి మెత్తటి పరుపుల్లాంటివీ అందమైన అమరికల్లో ఉంటాయి.
సెటప్స్ కూడా దొరుకుతున్నాయి :హాల్లో కిటికీ దగ్గరో, ఇంట్లో ఓ మూలకో, రెండు గదుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనో, మెట్ల కిందనో ఇలా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటీరియర్‌కు తగ్గట్టు ఉన్న ఆ కొంచెం స్థలంలోనే చదువుకోవడానికీ, పుస్తకాలు పెట్టుకోవడానికి సరిపోయేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఆహ్లాదకరంగా కనిపించడానికి నచ్చిన బొమ్మల థీముల్లో వాటికి పెయింటింగ్స్ వేసుకోవచ్చు. ఇలా ముందుగానే ఇంటి గోడలకు కలిపి కట్టుకోవడమేకాదు, విడిగా ఈ రీడింగ్ నూక్స్ సెటప్స్ కూడా దొరుకుతున్నాయి.