YSRCP Councillors Conflict in Rayadurgam :అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు వర్గలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో భేటీ కాస్తా రసాభాసగా మారింది. కౌన్సిల్ సాధారణ సమావేశానికి 16 మంది సభ్యులు హాజరయ్యారు. అయినా సమావేశాన్ని కొనసాగించడంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బండి అజయ్ అభ్యంతర వ్యక్తం చేశారు.
కోరం లేకపోయినా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డిని బండి అజయ్ ప్రశ్నించారు. 32 మంది కౌన్సిల్ సభ్యులకు గాను 1/3 కోరముంటే భేటీని నిర్వహించవచ్చని కమిషనర్ ఆయనకు సమాధానమిచ్చారు. నాలుగు సంవత్సరాలు ఓ రకంగా వ్యవహరించి ఇప్పుడు రెండు నెలలుగా కొత్త ఆనవాయితీని అమలు చేస్తున్నారని బండి అజయ్ దివాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ సాధారణ సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ పొరాళ్ల శిల్ప ప్రకటించారు.
Rayadurgam Councillors Clashes : మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ శిల్పకు పదవి గండం ఉన్న నేపథ్యంలో ఆమె కౌన్సిలర్ లావణ్యకు రూ.50,000లు ఇచ్చి ప్రలోభాలు గురిచేశారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి సభలో ఆరోపించారు. దీంతో లావణ్యకు శ్రీనివాసరెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీకి చెందిన 29మంది కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. మాట మాట పెరిగి తోపులాట చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు చుస్తూ అలానే ఉండిపోయారు.