ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడ కేంద్రంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం- సీఐడీతో దర్యాప్తు చేయిస్తామన్న మంత్రి మనోహర్ - Ration rice mafia

Ration Rice Illegal Transportation: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. కాకినాడ కేంద్రంగా వేల టన్నులు దేశసరిహద్దులు దాటిపోతోంది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ గోదాముల్లో నిల్వచేసిన రేషన్‌ బియ్యాన్ని ప్రత్యక్షంగా తనిఖీలు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేయడంతోపాటు పలువురిపై కేసులు నమోదుకు ఆదేశించారు. మొత్తం వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించనున్నట్లు మంత్రి మనోహర్‌ తెలిపారు.

Ration Rice Illegal Transportation
Ration Rice Illegal Transportation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 9:07 AM IST

Ration Rice Illegal Transportation: రాష్ట్రంలో పేద ప్రజల పొట్టకొట్టి అక్రమంగా ఆఫ్రికన్‌ దేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల గుట్టురట్టయ్యింది. కాకినాడలోని గోదాముల్లో, యాంకరేజ్‌ పోర్టులో నిల్వచేసిన వేలాది టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. వ్యవస్థీకృత రేషన్‌ మాఫియా అక్రమాలపై సమగ్రమైన నివేదిక తయారుచేసి, ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని ఆయన వెల్లడించారు.

తనిఖీలు పూర్తయ్యేవరకు ఎగుమతులు నిలిపివేయాలని పోర్టు అధికారులను మంత్రి ఆదేశించారు. కాకినాడ జిల్లాలో రెండు రోజులు పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌, యాంకరేజి పోర్టులో గోదాములు, బార్జిల్లో బియ్యం తరలిస్తున్న లంగరు రేవు పరిశీలించారు. మొత్తం 12,915 మెట్రిక్‌ టన్నుల నిల్వలు సీజ్‌ చేశామని మంత్రి మనోహర్‌ వెల్లడించారు. గోదాముల యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. యాంకరేజ్ పోర్టు అధికారులపైనా విచారణ చేయిస్తామని మంత్రి హెచ్చరించారు.

కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది: మంత్రి నాదెండ్ల - Nadendla Manohar on Ration Rice

కాకినాడ పోర్టు ద్వారా పెద్దఎత్తున దందా:పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రభుత్వం కేజీ బియ్యం రూపాయికే అందిస్తోంది. ఈ బియం సేకరణకు ప్రభుత్వానికి దాదాపు 40 రూపాయల వరకు ఖర్చవుతోంది. అయితే అక్రమార్కులు ఈ బియ్యాన్ని వారికి చేరకుండానే తస్కరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది. సొంతంగా నౌకలు ఏర్పాటు చేసుకుని విదేశాలకు బియ్యం తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమంగా ఆర్జిస్తున్నారో తెలుస్తోంది.

ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోనే: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గానూ , సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగానూ, షిప్పింగ్ సంఘం అధ్యక్షుడిగానూ పనిచేశారు. కొందరు మిల్లర్లు, ఎగుమతి దారులను గుప్పెట్లో పెట్టుకుని అక్రమ రేషన్‌ బియ్యం దందా సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సీజ్ చేసిన గోదాములు, బియ్యం నిల్వలన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్‌ అనుచరులవే కావడంతో అన్ని వేళ్లూ ఆయనవైపే చూపిస్తున్నాయి.

ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు - సరకు తూకంపై ఆరా - Minister Nadendla Inspection

పెద్దఎత్తున రేషన్‌ బియ్యం నిల్వలు: రాష్ట్రవ్యాప్తంగా నెలకు 2.12 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతుంటే, అందులో సగం మాఫియా సేకరిస్తోంది. అర్హతలేని వారికి రేషన్‌ కార్డులు ఇవ్వడం, కొందరు ఈ బియ్యం తినడానికి ఇష్టపడకపోవడం వల్ల రేషన్ బియ్యం మాఫియాకు కలిసొచ్చింది. ఊరూరా దళారులను నియమించుకుని కిలోకు 8 నుంచి 10 రూపాయల చొప్పున చెల్లించి రేషన్ బియ్యం సేకరిస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా ఆ బియ్యం కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సొంత షిప్పుల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్రమార్కులు అన్నిశాఖల సిబ్బంది సహకరిస్తున్నారు. పోర్టు ఆధీనంలోని గోదాముల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం నిల్వలు బయటపడినా, మాకు సంబంధం లేదని పోర్టు అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పోర్టుకు వెళ్లే సరకుల తనిఖీకి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది.

ఐదేళ్లపాటు ఇష్టానుసారం దోచుకున్నారు: తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు నుంచి సేకరించిన బియ్యాన్ని మచిలీపట్నం, కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. పోర్టులో లోడింగ్, అన్‌లోడింగ్‌ కోసం బిహార్‌, ఒడిశా కూలీలను పెట్టుకున్నారు. గతంలో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు ద్వారానే ఎగుమతి చేసేవారు. ఇప్పుడు ప్రైవేట్ పోర్టు ద్వారా ఎగుమతుల సామార్థ్యం పెంచి, అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలో 400 రైసు మిల్లులు ఉండటమేగాక ఆసియాలోనే అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు సైతం ఇక్కడే ఉన్నాయి. పౌరసరఫరాల వ్యవస్థ మొత్తం ఒక కుటుంబం చేతిలోనే ఉండటం వారికి కలిసొచ్చింది. ఐదేళ్లపాటు ఇష్టానుసారం దోచుకున్నారు. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించినా, ఇక్కడ నుంచి అక్రమ రవాణా ఆగలేదు.

పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం! - రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ నిలిపివేత - విచారణకు నాదెండ్ల ఆదేశం - Manohar inspected Ration warehouses

ABOUT THE AUTHOR

...view details