Ration Dealer Stuffed Rice Bags With Rice Husk in Khammam District :పేద ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతునే ఉన్నాయి. కాకినాడ పోర్టులో ప్రభుత్వ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న షిప్లను పట్టుకున్న దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమాలు రోజురోజూకూ వెలుగులోకి వస్తున్నాయి.
ఇక్కడి బియ్యాన్ని దేశ విదేశాలకు రేషన్ మాఫియా పక్కదారిలో అధికారుల కళ్లు కప్పి దాటిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా వందల కోట్లు విలువ చేసే బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ముఖ్యంగా రేషన్ మాఫియాకు నెలవుగా కొందరు రేషన్ డీలర్లు ఉంటున్నారు. వీరు ఎంచక్కా బియ్యాన్ని నల్ల బజార్లలో అమ్మేస్తూ పేదల పొట్టలు కొడుతున్నారు. విభిన్న రూపాల్లో బియ్యాన్ని అడ్డదారిలో బయటకు పంపి కోటీశ్వరులు అవుతున్నారు. ఇందులో బడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ఇద్దరు యువకులు ఒంటిచేత్తో రేషన్ దుకాణంలో బస్తాలను పైకెత్తేస్తున్న చిత్రాన్ని చూస్తున్నారు కదా. అవి ఏ బస్తాలో తెలుసా? నిజానికి వారేమీ మల్లయోధులు కాదండోయ్! ప్రజా పంపిణీలో సరఫరా చేసే బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించి, వాటి స్థానంలో నింపేసి పెట్టిన వరి పొట్టు బస్తాలను ఇలా ఒంటి చేత్తో ఎత్తేస్తున్నారు. ఏ క్షణంలో ఏ అధికారి వచ్చి తనిఖీలు చేస్తారో అన్న ఆలోచనతో రేషన్ డీలర్ కొత్త పంథాకు తెర తీశాడు. నిల్వల్లో తేడా రాకుండా ఉండేందుకు వరిపొట్టు నింపిన బస్తాలను బియ్యం స్థానంలో ఉంచాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ముందు వరుసలో బియ్యంతో ఉన్న బస్తాలను ఉంచి, వాటి వెనక వరుసలో వరి పొట్టు బస్తాలను అమర్చాడు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసి లోగుట్టును రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.